మాతా శిశు మరణాలు నివారించడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం లబ్ధిదారులకు సరిగా అందడం లేదు. బాలామృతం పేరుతో ఆహారం, కోడిగుడ్లతోపాటు పాలు పంపిణీ చేయాల్సి ఉన్నా వారికి చేరడం లేదు. ప్రకాశం జిల్లాలో రెండునెలలుగా పాల పంపిణీ నిలపేశారు.
అమృత హస్తం.. అమలుకు కష్టం
జిల్లాలో 21 ప్రాజెక్టుల్లో 4 వేల 244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో చిన్నారులు 2.49 లక్షలు, గర్భిణీలు 23 వేలు, బాలింతలు 22 వేల మంది ఉన్నారు. బలమైన ఆహారాన్ని అందించడానికి 2015లో అప్పటి తెదేపా ప్రభుత్వం అమృత హస్తం పథకాన్ని ప్రారంభించింది. ఓ మెనూ ప్రకారం పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. గర్భిణీలకు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్లు, చిన్నారులకు 100 మిల్లీ లీటర్లు పాలు ఇవ్వాలి. గత 2 నెలలుగా ఈ మెనూ అమలు కావడం లేదు.