విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన తల్లీకుమారుడు మృతిచెందడం పట్టణంలో విషాదం నింపింది. కందుకూరుకు చెందిన వ్యాపారి వెంకట ప్రసాద్‌కు, అతని భార్య జయలక్ష్మీ, కుమారులు పవన్, మనోజ్‌లకు కరోనా పాజిటివ్ నమోదైంది. విజయవాడలో వైద్యం బాగుంటుందని స్నేహితులు చెప్పిన మేరకు స్వర్ణ ప్యాలెస్‌లో చేరారు. 2 రోజుల కిందట వెంకటప్రసాద్, చిన్నకుమారుడు మనోజ్‌కు నెగెటివ్ రావటంతో డిశ్ఛార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. జయలక్ష్మి, పవన్‌లకు ఇంకా నయం కాకపోవటంతో అక్కడే ఉన్నారు. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది.
అగ్నిప్రమాదంలో చిక్కుకుని వారిద్దరూ మృతి చెందారు. పవన్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని భార్య 8 నెలల గర్భవతి. ప్రస్తుతం ప్రసవం కోసం వినుకొండలోని పుట్టింట్లో ఉంది. ఈ ఘటనతో వారి కుటుంబంతోపాటు కందుకూరులోనూ విషాధ ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు విజయవాడ వెళ్లారు.