ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరివాడు...ఈ బలరాముడు

కరణం బలరాం... ఏపీ  రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు... దాదాపు 4దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన... ఇప్పటికీ చురుకే. ఏడో దశకంలో రాజకీయాల్లో  అడుగుపెట్టిన ఆయన చీరాలలోని రామకృష్ణాపురంలో ఉన్న తన సొంత ఇంటిలో నివసించారు. సుమారు 30 ఏళ్ల తర్వాత మళ్లీ తన పాత ఇల్లే కేంద్రంగా ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు.

By

Published : Mar 18, 2019, 8:41 AM IST

అందరివాడు...ఈ బలరాముడు

అందరివాడు...ఈ బలరాముడు

కరణం బలరాం స్వస్థలం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం. అక్కడే ఆయన పదో తరగతి వరకు చదివారు. అనంతరం విద్యాభ్యాసం విజయవాడలో సాగింది. 1970ల్లో యువజన కాంగ్రెస్‌ ద్వారా ఆయన రాజకీయ రంగ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో ఆయన కుటుంబంతో కలిసి రామకృష్ణాపురం ఇంటిలోనే నివసించేవారు.
4 సార్లు ఎమ్మెల్యేగా...ఒకసారి ఎంపీగా...
4సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఒంగోలు ఎంపీగా గెలుపొందిన కరణం మొదటి 2ఎన్నికల్లో ఈ ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించారు. 1978లో తొలిసారిగా అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినా... రామకృష్ణాపురమే ఆయన నివాసం. ఆయన ముగ్గురు సంతానం ఇక్కడే జన్మించారు. 1983లో ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించినప్పుడు బలరాం అద్దంకి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1985లో తెదేపా తరఫున మార్టూరులో పోటీ చేసి విజయకేతనం ఎగుర వేశారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో కలిసి చీరాలలోనే నివసించారు.
విడదీయరాని అనుబంధం
మార్టూరులో ఎన్నికయ్యాక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చిలకలూరిపేటకు మకాం మార్చవలసి వచ్చింది. అనంతరం ఆయన రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఒంగోలు చేరారు. కరణానికి... చీరాల వీఆర్‌ఎస్, వైఆర్‌ఎన్‌ డిగ్రీ కళాశాలతో విడదీయలేని అనుబంధం ఉంది. జగదీశ్వరరావు ప్రిన్సిపల్‌గా ఉన్నప్పుడు బలరాం ఎగ్జిక్యూటివ్‌ బాడీ సభ్యుడిగా ఎంపికయ్యారు. చీరాల నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బలరాం మళ్లీ 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత పాత ఇంటినే కేంద్రంగా చేసుకోనున్నారు. ఇప్పటికే ఆయన రామకృష్ణాపురంలో కార్యకలాపాలు ప్రారంభించారు. పాత ఇల్లును మరమ్మతులు చేస్తున్నారు. ఇక్కడ అందరితో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. ఇదే తన గెలుపునకు బలమని బలరాం అంటున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారని రామకృష్ణాపురం వాసులు అంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details