ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాయిచరణ్ రెడ్డి ఇంజినీరింగ్‌లో ఈసీఈ చేశారు. పట్టా రాగానే విదేశాల్లో కొలువు కోసం ప్రణాళికలు వేసుకున్నారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్ర విభజనపై ఉద్యమం జరుగుతుంది. సకలం బంద్.. ఇంట్లో ఖాళీ ఉన్న ఆ సమయంలో సాయి చరణ్ డిజిటల్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. సాఫ్ట్వేర్ స్కిల్స్‌తో పాటు వెబ్ డిజైనింగ్, సర్వీస్ మీద అవగాహన పెంచుకున్నారు. వెబ్ డిజైనింగ్‌ను కెరీర్‌గా మలుచుకున్నారు.
అప్పటి నుంచి వెబ్ డిజైన్, యాప్స్ రూపకల్పన, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి విషయాలపై అవగాహన పెంచుకున్నారు. సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ ప్రారంభించారు. నగరాల్లో డిజిటల్ టెక్నాలజీ ట్రైనింగ్, సర్వీస్, మార్కెటింగ్ విభాగాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. తాను పుట్టి పెరిగిన ఒంగోలులో వీటికి అంతగా అవకాశాలు లేవని తెలిసినా... పట్టుదలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇతర ప్రాంతాల్లోని వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని సర్వీసెస్ విభాగంలో వ్యాపారాన్ని కొనసాగించారు.
తొలుత ఇద్దరు ఉద్యోగులతో...తన ఇంటి వద్దనే డిజి వ్యూ పేరుతో కంపెనీ ప్రారంభించారు సాయిచరణ్. ఇందులో డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ టెక్నాలజీ ఎనెబుల్ సర్వీసెస్, సామాజిక మాధ్యమాల్లో అడ్వర్టైజింగ్, ఆన్ లైన్ విద్య, ఆండ్రాయిడ్- ఐఓఎస్ యాప్స్ రూపకల్పన వంటి సేవలందిస్తూ కంపెనీ ఆదాయాన్ని పెంచుకున్నారు.