నివర్ తుపాను కారణంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒంగోలు పట్టణంలో పోతురాజు కాలువ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పలు కాలనీలు నీట మునిగాయి. పాప కాలనీ, అరుణ నగర్ ప్రాంతాల్లో 2,3 అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఓ వైపు రాత్రంతా వర్షం..మరోవైపు చలిలో కాలనీ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. మార్టూరు మండలం డేగరమూడి-వలపర్ల గ్రామాల మధ్య రహదారిపై ప్రమాదకర స్థాయిలో వరదనీరూ పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలో విస్తారంగా వర్షాలు..పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు - nivar cyclone newsupdates
ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి. రహదారిపై వరద నీరు పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై వరదనీరు వల్ల ప్రకాశం జిల్లా జాతీయ రహదారిపై రాకపోకలను నియంత్రించారు. రాజుపాలెం చెక్ పోస్టు వద్ద వాహనాలను నిలిపివేశారు. దర్శి మండలం త్రిపుర సుందరీపురం రహదారి కోతకు గురైంది. మారళ్ల ఈదరవాగు రహదారిపై 12 అడుగుల మేర ప్రవహిస్తుండటంతో పోలీసులు ఈ రహదారిపై రాకపోకలు నిలిపివేసి...పహారా కాస్తున్నారు. ఉలవపాడు మండలంలో ఆత్మకూరు కాలువ పొంగి ప్రవహిస్తోంది. అర్ధవీడు మండలంలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.