ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాదాపు 200 ఎకరాల భూములున్నాయి. ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న ఇవి ఎర్ర నేలలు కావడంతో అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. క్రమంగా వాటిని ఆదాయవనరుగా మార్చేసుకున్నారు. సర్వే నంబరు 151లో దాదాపు 50 ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. 15 మీటర్ల లోతు వరకు తవ్వడంతో.. ఆ భూములు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.
ఈ మండలం పరిధిలో రహదారులు, ఇటుక బట్టీలు, ఇతర అవసరాల కోసం మట్టికి డిమాండు ఉండటం, మంచి ధర పలకడంతో నిత్యం వాహనాల్లో తరలిపోతోంది. టిప్పర్ మట్టి రూ.8-10వేలు, ట్రాక్టర్ మట్టి రూ.3-4వేలు ఉంది. ఇలా ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. అయినా రెవెన్యూ, సెబ్, పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టేందుకే ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్లు కొందరు వైకాపా నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.