అన్నీ బాగున్నా గంటకింత చొప్పున ట్రాక్టర్లు, యంత్రాలతో దుక్కి దున్నిస్తున్న కాలమిది.! పొలం చదును చేయడం నుంచి కోత వరకూ.. యంత్రాలే నిమిషాల్లో పూర్తి చేసే స్థాయి. అయితే సాగుపై ప్రేమో లేక కాడెద్దులు మాట వింటాయన్న ఆత్మవిశ్వాసమో..., ఈ రైతు పొలం దున్నడం మాత్రం చాలా ప్రత్యేకం.! అంగవైకల్యం ఉన్నా పొలం విషయంలో ముందే ఉంటున్నారు మద్దిలేటి.
మద్దిలేటి స్వస్థలం కర్నూలు జిల్లా కోడుమూరు. పదహారేళ్ల వయసులో.. ఎద్దుల కాడి మీద పడి సెప్టిక్ కావడం వల్ల వైద్యులు కాలు తొలగించారు. వాస్తవానికి పుట్టుకతో వచ్చే అంగవైకల్యం కన్నా.. మధ్యలో వచ్చే వైకల్యం కలిగించే బాధ భరించడం కష్టం. ఆ వ్యథను దిగమింగుతూ.. ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయిస్తూ సాగులో ఆనందం వెతుక్కుంటున్నారీయన.