Agitation with Petrol Bottles:మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు భాస్కర రెడ్డి కంపెనీ మాజీ ఉద్యోగి ఆంజనేయులును పోలీసులు అదుపులో తీసుకోవడంపై వివాదం నెలకొంది. విశాఖలో భాస్కర్ రెడ్డి భూ అక్రమాలపై ఇటీవల వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఆంజనేయులు లీక్ చేస్తున్నాడనే ఆరోపణలతో అతని మీద కక్ష కట్టారు.
ఆర్థిక లావాదేవీలుపై నరేష్ అనే వ్యక్తి ఆంజనేయులుపై ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ కేసు కట్టారు. ఈ కేసు నిమిత్తం ఆంజనేయులను విచారించేందుకు పోలీస్లు అదుపులోకి తీసుకున్నారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. మళ్లీ సోమవారం సాయంత్రం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి ఆంజనేయులను విచారిస్తున్నారు.
ఆంజనేయులను మరింత సమగ్రంగా విచారించేందుకు విశాఖకు తరలించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులు కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. విశాఖ తరలిస్తే తాము ఒప్పుకోమని, అంజనేయులకు.. భాస్కర రెడ్డి వర్గీయులు వల్ల ప్రాణ హాని ఉందని ఆరోపించారు.
విశాఖకు తరలిస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ మేరకు వైసీపీ స్టిక్కర్లు అంటించిన వాహనం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉండటంతో.. ఆ వాహనంలో ఆంజనేయులను తరలిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు విచారణలో ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.