కృష్ణపట్నం ఆనందయ్య మందు(anandayya medicine)ను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉచితంగా పంపిణీ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. పోటా పోటీగా ఈ మందు పంపిణీ చేయడంతో రెండు చోట్ల జనం కిక్కిరిసిపోయారు. కరోనా(corona) రాకుండా ముందస్తు నివారణలో భాగంగా ఆనందయ్య 'పి' అనే మందు తయారు చేశారు. ప్రభుత్వం(govt) నుంచి అనుమతులు రావడంతో అధికార పార్టీకి చెందిన నేతలు అనందయ్యతో మాట్లాడి పెద్ద ఎత్తున మందును తయారు చేయించి ఒంగోలుకు తీసుకువచ్చారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అతడి తనయుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ చేశారు. పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. టెంట్లు, బారికేట్లు వేసి పట్టణ పరిధిలో ఉన్న సుమారు 5 వేల మందికి పంపిణీకి అనువుగా మందు సిద్ధం చేశారు. మందు ఉచిత పంపిణీ చేస్తున్నారనే ప్రకటన వెలువడిన వెంటనే అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కృష్ణపట్నం నుంచి మందు తెప్పించారు. నియోజకవర్గంలో 5 వేల మందికి పంపిణీ చేసేందుకు ఆయన ఇంటివద్ద హుటాహుటిన ఏర్పాట్లు చేశారు.