నెల్లూరు జిల్లా గూడూరులో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. సిలికా నుంచి గ్రావెల్ రవాణా చేసే క్రమంలో అడ్డొచ్చిన అధికారులు, సిబ్బందిపైనా దాడులకు పాల్పడుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అడ్డుకుంటుండగా .. వైకాపా నాయకుడు కోటి తనపై దాడి చేసినట్లు వీఆర్వో హనుమంతరావు వాపోయారు. ప్రస్తుతం వీఆర్వో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
అక్రమ గ్రావెల్ తరలింపును అడ్డుకున్న వీఆర్ఓ హనుమంతరావుపై వైకాపా నాయకుడు కోటేశ్వరరావు, అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఓ వీడియోను ట్వీట్ కు జత చేశారు. నెల్లూరు జిల్లాలో వైకాపా అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.