Union Minister Murugan Comments: నెల్లూరులో కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి దయాకర్ రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి బ్రహ్మానందంలను గెలిపించాలని నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ చేస్తున్న మంచిని వివరిస్తూ.. తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏవి?: అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్.. పాదయాత్ర సమయంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన హామీని నెరవేర్చలేదని కేంద్ర మంత్రి మురుగన్ విమర్శించారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
అవకాశాలు రావడం లేదు: గత తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 కి పెంచితే, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 60 నుంచి 62 కు పెంచడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన గురించి చెప్పారని.. స్వాతంత్ర దినోత్సవం నాడు మాట ఇచ్చారని.. సంవత్సరంలోపు పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. నేడు ఆ దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేస్తూ, నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తేందుకు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.