ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో టెన్షన్​ వాతావరణం.. ఈరోజు మంత్రి, మాజీ మంత్రి వేర్వేరు సభలు

Minister Vs Ex-minister: నెల్లూరులో టెన్షన్​ వాతావరణం నెలకొంది. ఈరోజు మంత్రి కాకాణి గోవర్ధన్​రెడ్డి, మాజీ మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​లు ఓకేరోజు వేర్వేరు సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాకాణికి సంబంధించిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం.. అనిల్​ వర్గం పనేనని కాకాని వర్గం వారు ఆరోపించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.

kakani-anil
kakani-anil

By

Published : Apr 17, 2022, 7:39 AM IST

Kakani Vs Anilkumar Yadav: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత వైకాపాలో ఎంత రచ్చ సాగిందో తెలిసిందే. అసంతృప్తులను బుజ్జగించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే.. ఉక్రోషం అణచుకోలేకపోయినవారు రోడ్డున పడ్డప్పటికీ.. మిగిలిన వారు లోలోపల రగిలిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరు వైకాపాలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు. ఈ జిల్లానుంచి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్‌.. పునర్ వ్యవస్థీకరణలో పదవి పోగొట్టుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయన స్థానాన్ని భర్తీచేశారు. వీరిమధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, కేబినెట్ పరిణామాలు వీటిని మరింత రాజేశాయని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇవాళ అందరి దృష్టీ నెల్లూరు రాజకీయాలపైనే పడనుంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఒకేరోజు వేర్వేరు సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నగరానికి రానున్న కాకాణికి.. కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అదే సమయంలో అనిల్ కూడా.. నగరంలోనే మరో సభ నిర్వహించనున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి ఎలా సహకరించారో.. అనిల్ అంతకు డబుల్ ఇస్తాననడం గుర్తు తెలియని వ్యక్తులు కాకాణి ఫ్లెక్సీలు తొలగించడంతో పరిస్థితి వేడెక్కింది. అయితే.. తన కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపేందుకే సభ నిర్వహిస్తున్నానంటూ.. అనిల్ స్పష్టం చేశారు. సభ నిర్వహణకు.. తానే ముందు అనుమతి తీసుకున్నట్లు చెప్పారు.

రెండింతలు ఇస్తానన్న అనిల్ : వీరి విభేదాల చర్చ.. మూడు రోజుల నుంచి ఎక్కువైంది. మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అనిల్‌ తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదని చెప్పారు. పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఆంతేకాకుండా.. వ్యంగ్య బాణాలూ విసిరారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎలాంటి సహకారం అందించారో.. తనపై ఎలాంటి ప్రేమ చూపారో.. కచ్చితంగా అదే ప్రేమ, సహకారం రెండింతలు అందిస్తానని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. దీంతో.. నెల్లూరు వైకాపాలో గ్రూపు రాజకీయాలు రంజుగా మారబోతున్నాయనే చర్చ అప్పుడే మొదలైంది.

కాకాణి ఫ్లెక్సీ తొలగింపు: వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. తొలిసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు వస్తున్నారు. ఈరోజు మంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో.. అక్కడి మంత్రి అనుయాయులు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా.. కావలి నుంచి నెల్లూరు నగరం వరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట హరనాథ్ పురం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో.. వైకాపాలో దుమారం చెలరేగింది. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎదురుగా వంతెనపై కాకానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీని భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని జాతీయ రహదారుల అధికారులు క్రేన్​తో తొలగించారు. అనంతరం పక్కనే ఉన్న కాలువగట్టుపై ఆ ఫ్లెక్సీని పడేశారు. దీంతో.. మరో వివాదానికి అవకాశం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు వైకాపాలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ జిల్లానుంచి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్‌.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పదవి పోగొట్టుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయన స్థానాన్ని భర్తీచేశారు. వీరిమధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, కేబినెట్ పరిణామాలు వీటిని మరింత రాజేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details