వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమయ్యాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన దళిత రైతు జైపాల్‌పై పోలీసులు వేధింపులకు దిగడం దారుణమని విమర్శించారు. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు.
జైపాల్‌ను బలవంతంగా జీపులో వేసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధించటం మానవ హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. దీనిపై మానవ హక్కుల సంఘంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ నెపంతో దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చేతకానితనం వల్లే పేదలకు భూ పంపిణీ ఆగుతుంటే, ఆ నెపాన్ని చంద్రబాబుపై వేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వెంటనే రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని ప్రకటించిన సీఎం.. వరదలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్న కనీసం 3 రూపాయలు ఖర్చుపెట్టలేదని దుయ్యబట్టారు.