సగటున ప్రతి ఇంటిపై 1500 రూపాయల అదనపు విద్యుత్ బిల్లుల భారం మోపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో పెరిగిన విద్యుత్ ఛార్జీలతో దాదాపు 120 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 3 నెలల కరెంటు బిల్లులు మాఫీ చేయాలని, ఫిబ్రవరి బిల్లునే ఈ 3 నెలలకు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
పేదలకు కానుకలని చెప్పే ముఖ్యమంత్రి... కరెంట్ బిల్లులు, నిత్యావసర సరకుల ధరలు, మద్యం ధరలు పెంచడమేనా కానుక.. అని ప్రశ్నించారు. కరోనాను కూడా క్యాష్ చేసుకునే వారు రాష్ట్రంలో తయారయ్యారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొనిందని పేర్కొన్నారు.