విరేచనాలు అవుతుండటంతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలికి 5.50 లక్షల రూపాయల బిల్లులు వేశారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
విరేచనాలు అవుతున్నాయని ఆస్పత్రిలో చేరితే...రూ. 5.50 లక్షల బిల్లు! - నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రి నేరం వార్తలు
నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. విరేచనాలు అవుతుండటంతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలికి 5.50 లక్షల రూపాయల బిల్లులు వేశారని మండిపడ్డారు.
బాధితురాలి కుమారుడు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని చిన్నబజారుకు చెందిన ఓ మహిళ(53) పదిరోజుల కిందట ఆస్పత్రిలో చేర్చారు. ఈమెకు నెల కిందట కొవిడ్ పాజిటివ్ రావటంతో నారాయణ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత నెగెటివ్ రాగా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఆ తర్వాత విరేచనాలు అవుతుండటంతో ఆస్పత్రిలో పది రోజుల కిందట చేర్చారు. అప్పట్నుంచి ఆమెకు చికిత్సను అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు.. కామెర్లు వచ్చాయని వివరించారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట టిఫిన్ తినిపించేందుకు ఆమెను నిద్రలేపగా లేవకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారని వైద్యులు సమాధానమిచ్చారు. అనంతరం బాధితురాలిని ఐసీయూలో చేర్చేందుకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని చెప్పి కొవిడ్ వార్డులో చేర్చారు. ఆమె పరిస్థితిపై కుటుంబ సభ్యులు పలుమార్లు అడిగినా ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వేరే ఆస్పత్రికి తరలిస్తామని బాధితులు కోరగా.. అందుకు నిరాకరించారు. ఆస్పత్రిలో అందించిన చికిత్సకు సంబంధించి రూ.5.50 లక్షలు బిల్లులు వేయగా.. రూ.4.50 లక్షల వరకు బీమా కింద క్లెయిమ్ చేసుకున్నారు. మిగతా రూ. లక్ష కట్టాల్సిందిగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయని పేర్కొన్నారు.