ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Boy missing: 8 రోజులైంది అడవిలో తప్పిపోయి.. ఎక్కడున్నావ్​రా చిన్నా.. త్వరగా ఇంటికి రా!

రోజూ బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేసే పసివాడు కనిపించకపోవడంపై ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. మూడేళ్లు కూడా నిండని బిడ్డ... ఆ అడవిలో ఎలా ఉన్నాడో.. ఏం తింటున్నాడో తెలియక తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. బాబునే తలచుకుంటూ ఎనిమిది రోజులుగా నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నారు. ప్రాణాలతో ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని... బరువెక్కిన గుండెతో తల్లిదండ్రులు, స్థానికులు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నారు.

children missing in a forest
అడవిలో తప్పిపోయిన పసివాడు

By

Published : Jul 6, 2021, 4:59 PM IST

Updated : Jul 6, 2021, 8:23 PM IST

ఎక్కడున్నావ్​రా చిన్నా.. త్వరగా ఇంటికి రా!

ఆ బాలుడు ఎప్పుడు తిరిగి వస్తాడా.. అని తల్లీ, తండ్రి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 8 రోజుల క్రితం అడవిలోకి వెళ్లినప్పుడు పొరపాటున తండ్రి నుంచి తప్పిపోయిన ఆ చిన్నారి.. ఇప్పటివరకూ కనిపించకపోవడంపై.. కుటుంబీకులే కాక.. అక్కడి ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లు కూడా లేని ఆ పసి కందు.. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో.. అని వారు పడుతున్న దిగులు.. క్షణక్షణానికి పెరుగుతోంది. రోజులు గడుస్తున్నా.. ఆ బాలుడు ఇంటికి చేరకపోవడం.. వారి ఆందోళనను మరింత పెంచుతోంది. ఏ పిల్లాడి అరుపులు విన్నా.. ఏడుపు విన్నా.. నవ్వు వినిపించినా.. తన కుమారుడే తిరిగి వచ్చాడేమో.. అన్నంత ఆరాటంతో.. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

ఏం జరిగిందంటే..

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన బుజ్జయ్య, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. జూన్ 29న ఉయ్యాలపల్లి గిరిజన కాలనీ పక్కనే అటవీ ప్రాంతలో మేకలు కాసేందుకు బుజ్జయ్య వెళ్లాడు. తండ్రి వెనకాలే వెళ్లిన సుమారు మూడేళ్ల వయసున్న అతని కుమారుడు సంజు (పెద్ద కుమారుడు).. దారిలో బుజ్జయ్య నుంచి విడిపోయాడు. గమనించని బుజ్జయ్య.. అలాగే ముందుకు వెళ్లిపోయాడు. కొంత సమయానికి కుమారుడు తనతో లేడని గ్రహించి.. చుట్టుపక్కల వెదికినా ఆచూకీ దొరకలేదు. ఇంటికి వెళ్లి ఉంటాడని భావించిన బుజ్జయ్య.. వెళ్లి చూసే సరికి అప్పటికి సంజూ రాలేదన్న విషయం తెలిసి కంగారుపడ్డారు. అయినవాళ్లతో కలిసి.. ఆ రోజు అంతా సంజూ కోసం పరసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేశారు. అయినా.. సంజూ జాడ దొరకలేదు. నాటి నుంచి.. నేటి వరకూ.. ఆ కుటుంబీకులతో పాటు.. స్థానికులు, పోలీసులు గాలిస్తూనే ఉన్నా.. ఫలితం మాత్రం రావడం లేదు.

ఎవరైనా ఎత్తుకెళ్లారేమో అని అనుమానం ఉంది. ఆ కోణంలో వెతికితే బాగుండు. వాడికి మాటలు కూడా రావు. మాటలు వచ్చినా పేరు, ఊరి పేరు చెప్పేపాడు. నా బాబు లేకుండా నేను ఉండలేను. ఎవరైనా తీసుకెళ్లి ఉంటే దయచేసి నా బాబును నాకు ఇవ్వాండి మీ కాళ్లు మొక్కుతా. మీ మీద ఎలాంటి కేసులు కాకుండా చూసుకుంటాం.- వరలక్ష్మి, బాలుడి తల్లి

ఎవరైనా తీసుకెళ్లారా..

ప్రతేక పోలీసు బలగాలు, గ్రామస్థులు అటవీప్రాంతం అంతా గాలించారు. ఆఖరికి.. డ్రోన్ల ద్వారా వెతికినా ఆచూకీ తెలియలేదు. తప్పిపోయిన రోజు సెల్ టవర్ల ద్వారా కాల్ డేటాను పరిశీలించారు. ఇంత వరకు ఎలాంటి జాడలు కనిపించ లేదు. ఈ విషయానికి సంబంధించిన ఏ సమాచారం లభించలేదు. ఎవరైనా సంజూను తీసుకుపోయారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ బాలుడు దొరుకుతాడని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

8 రోజులైనా...

తప్పిపోయి ఎనిమిది రోజులైనా కనీసం ఆచూకీ కూడా లభించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. సంజూ త్వరగా ప్రాణాలతో ఇంటికి తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుతున్నారు.

ఇదీ చదవండి:

15 వేల మంది మహిళల్ని పోలీసు శాఖలో ఎలా చేర్చుకున్నారు?: వర్ల రామయ్య

Last Updated : Jul 6, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details