నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో సూదుల గుంట షుగర్ ఫ్యాక్టరీ 2018లో కడప, నెల్లూరు జిల్లాల రైతుల వద్ద 95 వేల మెట్రిక్ టన్నుల చెరుకు కొనుగోలు చేసింది. 95 వేల మెట్రిక్ టన్నులకు రూ.23 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ 14 కోట్ల రూపాయల మాత్రమే చెల్లించారు. మిగిలిన తొమ్మిది రూ.కోట్లు చెల్లించకుండా ఏడాదిన్నరగా కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా.. కంపెనీ యాజమాన్యం సమాధానం చెప్పడం లేదని రైతులు అంటున్నారు.
చెరుకును షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తే.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్కు తమ గోడు చెప్పుకున్నా.. ఎవరూ పట్టించుకోవటంలేదని ఆవేదన చెందుతున్నారు. పంటపై లక్షల్లో పెట్టుబడి పెట్టామని, షుగర్ ఫ్యాక్టరీ యజమాని డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.