PENSIONERS PROTEST AT SPANDANA PROGRAM: నెల్లూరు జిల్లాలో పింఛన్ల తొలగింపుతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పింఛన్లు పోయాయని స్పందన కార్యక్రమానికి వందలాది మంది బాధతో తరలివచ్చారు. వారికి అధికారులు చెప్పే కారణాలు నచ్చకపోవడంతో కన్నీటితో వెనుతిరిగారు. ఎక్కువ మంది ఈ నెల నుంచి రాలేదని.. మరి కొందరు జూన్ నుంచి ఆగిపోయిందని అధికారులకు గోడును వినిపించారు. సామాజిక భద్రత పింఛన్ మాకు భరోసా అని బాధితులు స్పష్టం చేస్తున్నారు.
పింఛన్ వస్తే గౌరవంగా ఉంటాం: నెల్లూరు జిల్లాలో భారీగా పింఛన్ల కోత పెట్టారు. 2014 నుంచి పింఛన్ తీసుకుంటున్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. 200 రూపాయలు నుంచి పింఛన్ తీసుకుంటూ హాయిగా జీవితం గడుపుతున్నామని,.. పింఛన్ వస్తే కుటుంబ సభ్యులు గౌరవంగా చూసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి మా పింఛన్ తీసేస్తే.. మాకు భరోసా ఏదని వారు ప్రశ్నిస్తున్నారు. పేద కుటుంబాలకు పింఛన్ ఎంతో కొంత ఆదరువుగా ఉందని చెప్పారు. వారి గోడు వెళ్లబోసుకునేందుకు స్పందన కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు.
ఒక్కో నియోజకవర్గంలో 3000 పింఛన్లు తొలగింపు: జిల్లాలో 12 వేలకు పైగా పింఛన్లు పోయాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2500 నుంచి మూడు వేల మందిని తొలగించారు. పింఛన్లు పోయినవారు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ బోరున విలపిస్తున్నారు. రాణమ్మ అనే వృద్ధురాలు నడవలేక నెల్లూరు కార్పొరేషన్‌కు వచ్చింది. వృద్ధాప్య పింఛన్ తొలగించారని కన్నీరుమున్నీరయ్యింది. తన కొడుకు ఆటో తోలుతున్నాడని.. పింఛన్ ఉంటే తాను కుటుంబానికి భారం కానని, కానీ ఇప్పుడు మందులు తెచ్చుకోవడానికి కూడా పింఛన్ లేకుండా పోయిందని బోరున విలపిస్తోంది.