మృత్యువుతో పోరాడుతోన్న ప్రవల్లిక నెల్లూరు జిల్లా చేజర్లకు చెందిన పెంచలరామయ్య, పెంచలమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. మూడో కుమార్తె ప్రవల్లిక. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ అమ్మాయికి రెండు నెలల క్రితం అనారోగ్యం ఏర్పడింది. మెుదట నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేయడంతో నగరంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ సమస్య ఎక్కువ కావడం వల్ల తప్పనిసరై చెన్నైకి తరలించారు. డబ్బులు లేక అంబులెన్స్‌కు అప్పుచేసి తీసుకెళ్లారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రవల్లిక అక్కడే చికిత్స తీసుకుంటోంది.
సమస్య ఇదే
ప్రవల్లికకు గుండె, కిడ్నీల సమస్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెకు సంబంధించి.. శుభ్రమైన రక్తం.. నాళాల్లోకి వెళ్లడంలోనే సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులపైనా పడగా.. ఇన్‌ఫెక్షన్ ఎక్కువవుతోంది. రెండు నెలలుగా కూర్చొనే కాలం వెళ్లదీస్తోంది ప్రవల్లిక. పడుకోవడానికీ సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. చిన్నారికి నిద్ర కరవైంది. ఆపరేషన్ చేయడానికి విముఖత చూపుతున్నట్లు కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.
ప్రైవేటులో చేర్పించేందుకు ఆరోగ్యశ్రీ వర్తింపుపై అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో 'ఈనాడు-ఈటీవీ'ని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన 'ఈనాడు-ఈటీవీ' ప్రతినిధులు సమస్యను జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు ప్రవల్లిక పెదనాన్న వెంకటయ్య సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలసి సమస్యను వివరించారు. పాపను బతికించాలని విన్నవించారు.
స్పందించిన కలెక్టర్
ప్రవల్లిక పరిస్థితిపై జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు వెంటనే స్పందించారు. గ్రీవెన్స్‌లోనే జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ నాగార్జునను పిలిచి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ద్వారా వివరాలు సేకరించడంతో పాటు.. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకవేళ ఆరోగ్యశ్రీ వర్తించనికపోతే ప్రత్యేక నిధుల నుంచి రూ.3 లక్షల నుంచి 4లక్షల వరకు వెచ్చించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. పాప ప్రాణం కాపాడాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన నాగార్జున చెన్నైలోని ఆరోగ్యశ్రీ డీసీ డాక్టర్ పెద్దిరెడ్డితో మాట్లాడారు. పాప పరిస్థితిని వివరించారు.
మార్పునకు చర్యలు
చెన్నైలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రవల్లికను చేర్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ విభాగాలకు సంబంధించి వైద్యసేవలు అందించాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాల సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవకాశం ఉంది. పల్మనాలజీకి సంబంధించిన సేవలు ఆ పరిధిలో లేకపోవడంతో వాటికి గాను సొమ్ము చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ శేషగిరిబాబు మరోమారు సమీక్షించి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన నివేదిక తనకు సమర్పించాలని కోరినట్లు సమాచారం.