ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు!

Mekapati Goutham Reddy passed away: నొప్పి ఏదైనా.. మనకు అది బాధ మాత్రమే. కానీ, మనవాళ్లకు మాత్రం నరకం! గుండెపోటులాంటి తీవ్రమైన ప్రాణాంతక పరిస్థితులు వారు భరించలేనివి..! మాటల్లో చెప్పతరం కానివి!! ప్రాణాపాయంలో ఉన్నవాళ్ల అవస్థను చూసి తట్టుకోలేక.. చేయడానికి ఏమీలేక.. మిన్ను విరిగి మీదపడుతున్నట్టుగా.. కాళ్ల కింది భూమి కదిలిపోతున్నట్టుగా గుండెల్లో భయం విస్పోటనమైన వేళ.. మనవాళ్ల హృదయం ఎంతలా తల్లడిల్లిపోతుందో తెలుసా? అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది!! అర్ధంతరంగా ఈ లోకాన్ని వదిలిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి సతీమణి.. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు..!!!

"నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు!
"నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు!

By

Published : Feb 21, 2022, 5:56 PM IST

Updated : Feb 21, 2022, 10:53 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్..

సమయం.. ఉదయం 6 గంటలు..

రోజూలాగే నిద్రలేచారు మంత్రి గౌతమ్ రెడ్డి. 6:30 గంటల వరకూ దైనందిన కార్యక్రమాలు, షెడ్యూల్స్ కు సంబంధించిన వివరాలను ఫోన్లో చక్కబెట్టారు. 7 గంటలకు ఏదో ఆలోచిస్తూ నివాసంలోని రెండో అంతస్థులో సోఫాలో కూర్చుని ఉన్నారు మంత్రి మేకపాటి.

సమయం 7 గంటలా 12 నిమిషాలవుతోంది. శరీరంలో అప్పటి వరకూ పరిస్థితి ఎలా ఉందో తెలియదుగానీ.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంటమనిషికి చెప్పారు. అలా చెప్పి ఎంతో సమయం కాలేదు. సరిగ్గా మూడు నిమిషాలు గడిచాయి. అంటే.. 7 గంటలా 15 నిమిషాలకే గుండెల్లో నొప్పిగా ఉందంటూ.. సోఫాలో తల్లడిల్లిపోవడం ప్రారంభించారు.

భర్తమాటలు విన్న మేకపాటి సతీమణి శ్రీకీర్తి.. మరో నిమిషంలో (7:16) పరిగెత్తుకొచ్చారు. అంతా అయోమయం.. ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. మెల్లగా సోఫా నుంచి నేలమీదకు జారిపోతున్న మంత్రి మేకపాటిని.. బిగ్గరగా అరుస్తూ పరిగెత్తుకెళ్లి పట్టుకున్నారు భార్య శ్రీకీర్తి.

7:18 నిమిషాలకు డ్రైవర్ నాగేశ్వరరావు సైతం పరిగెత్తుకొచ్చి, తనకు తెలిసిన రీతిలో మంత్రిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఛాతిమీద నొక్కుతూ (సీపీఆర్) మంత్రికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

7:20 గుండెల్లో నొప్పితో తల్లడిల్లిపోతున్న మంత్రి మేకపాటి.. "నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" అన్నారు సరిగా గొంతు పెగలకుండానే! మంత్రి వ్యక్తిగత సిబ్బంది వేగంగా మంచినీళ్లు తెచ్చారు. కానీ.. వాటిని తాగలేకపోతున్నారు గౌతం రెడ్డి. ఇక, లాభంలేదు. పరిస్థితి మరింత తీవ్రమవుతోందని భార్య కీర్తికి అర్థమైపోయింది. వెనువెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

7:22 గంటలకు మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆసుపత్రికి బయలుదేరారు. కారులో అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆసుపత్రి ప్రాంగణాన్ని దాటేసి, అత్యవసర చికిత్సా విభాగంలోకి మంత్రిని తరలించారు.

అంతే వేగంగా స్పందించిన ఆసుపత్రి సిబ్బంది.. మంత్రి పల్స్ చెక్ చేశారు. సమయం 8:15 గంటలు నాడీ పనితీరు బాగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స కొనసాగిస్తున్నారు. బయట మంత్రి భార్య శ్రీకీర్తి.. ఎవరి ఊహకూ అందని ఆలోచనలు, ఆందోళనలో మునిగిపోయి ఉన్నారు. గుండెల్లో మొదలైన భయం.. కన్నీటి రూపంలో ఉప్పొంగుతుంటే.. నిశ్చేష్టురాలై నిల్చున్నారు. అంతా మంచే జరగాలని ఎందరు దేవుళ్లను ప్రార్థించిందో..!! కానీ అప్పటికే దారుణం జరిగిపోయింది. ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో.. ఉదయం 9:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో వైద్యులు నిర్ధరించారు. 9:15 గంటలకు అధికారిక ప్రకటన చేశారు.

మంత్రి మేకపాటి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో .. ఈ వాస్తవాలను వెల్లడించారు మేకపాటి కుటుంబ సభ్యులు.

ఇదీ చదవండి:

Gowtham Reddy No More: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. ఎల్లుండి అంత్యక్రియలు

Last Updated : Feb 21, 2022, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details