కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే Kotamreddy is impatient : నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర అర్ధాంతరంగా నిలిచిపోయింది. అన్నీ ఏర్పాట్లు చేసుకుని సిద్ధమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జాతర నిర్వహణకు ఈవో అభ్యంతరం చెప్పడం చర్చనీయాంశమైంది. నిన్న సాయంత్రం వరకూ జాతర నిర్వహణకు అనుమతులు ఇచ్చిన ఈవో నేడు అడ్డుకోవడమేమిటని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా రూరల్ ఇంచార్జి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డిలు జాతర నిర్వహించకుండా ఈవోపై ఒత్తిడి చేయడంపై కోటంరెడ్డి అసహనం పాలయ్యారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర నిర్వహిస్తానన్న ధీమా వ్యక్తంచేశారు. రాజకీయ శక్తుల మూలంగా జాతర నిలిచిపోవడాన్ని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి ప్రజలకు మనవి చేశారు.
జాతరపై రాజకీయ రంగు..: నెల్లూరులోని సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర రాజకీయ రంగు పులుముకుంది. ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలను సైతం నెల్లూరులోని వైసీపీ నేతలు రాజకీయం వివాదాలకు కేంద్రంగా మార్చడం ప్రజలను విస్మయం పాలు చేసింది. శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర నిర్వహణకు అకస్మాత్తుగా అనుమతులకు తెరపడటంలో రాజకీయ విబేధాలే కారణమని స్పష్టం అవుతోంది.
జాతర నిర్వహణకు మూగ చాటింపు, కంకణధారణ తప్పనిసరి..: శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర నిర్వహణకు తప్పనిసరిగా మూగ చాటింపు, పూజ చేసే వ్యక్తులకు అర్చకులు కంకణం కట్టాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. తదుపరి జాతర కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జాతర నిర్వహణపై దేవాదాయ కమిషనర్‌ను ముందుగా సంప్రదిస్తే ఎన్నికల కోడ్ అడ్డంకి రాదన్నారు. కానీ రాత్రికి రాత్రి వాట్సప్‌లో దేవాదాయ శాఖ ఈవో జాతర నిర్వహణకు అభ్యంతరం చెబుతూ ఆదేశాలను పంపిణీ చేశారన్నారు. దానికి ఆనం విజయకుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కారకులయ్యారని ఆరోపించారు. చాటింపుదారులను అడ్డుకున్నారన్నారు.. ఈ విషయంలో ఈవోను తప్పుపట్టానన్నారు.
ఆర్థికసాయం అవసరం లేదు..: నెల్లూరులోని సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జాతరకు ఆర్థిక సాయం అవసరం లేదని కోటంరెడ్డి పేర్కొన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలు అమలు కావాలనే ఉద్దేశ్యంతో జాతర నిర్వహణకు ముందుకు వచ్చానన్నారు. జాతర నిర్వహణకు చాటింపు వేయాలి.. అర్చకుల సహకారం ఉండాలి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత జాతరను అడ్డుకోవడం బాధాకరం, విచారకరం. ఈ విషయాలను ప్రజలను గమనించమని కోరుతున్నానన్నారు. రాజకీయాలు ఉంటాయని తెలుసుకానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా రాజకీయాల్లో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను తలపెట్టిన ఆధ్యాత్మిక జాతర, ఇరువాళమ్మ అమ్మవారి జాతరను రాజకీయ జాతరగా మార్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డిలకు ఇది పద్ధతి కాదని తెలియజేస్తున్నానన్నారు.
ఎవరితోనైనా జాతర జరిపించండి ..: "ఒకేమాట చెప్పున్నా మీరే కాదు ఎవరితోనైనా జాతర జరిపిస్తే మాకు అభ్యంతరాలు లేవు.. ఓ సామాన్య భక్తుడుగా క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటాం.. ఓ శాసనసభ్యుడిగా కాకుండా వాలంటీర్‌గా, అమ్మవారి సేవకుడిగా సిద్ధంగా ఉన్నా.. నాపై కోపంతో జాతరను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు.. దేవాలయంలో అమ్మవారి సాక్షిగా అడ్డుకున్నారని సాక్ష్యాలు చూపించా.. 7 గంటల వరకూ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు.. వాట్స్ ఆప్‌లో లేఖ పెట్టింది మీ ప్రోద్బలంతో కాదా ఎందుకింత ఒత్తిడి చేశారు.. జాతరను ఆపడం న్యాయం, ధర్మం కాదు.. పది గంటలకు ఆపమని చెప్పడం సరైంది కాదు అంటూ కోటంరెడ్డి ఆక్రోశం వ్యక్తం చేశారు.
గరికపాటి నరసింహారావు ఆదేశం..: ఆధ్యాత్మికవేత్తల మాటలను వేదవాక్కుగా తీసుకోవాలి. నెల్లూరు గ్రామానికి మేలు జరుగుతుందని నేను సంకల్పధారణకు సిద్ధమై జాతర కోసం ముందుకొచ్చా.. ఈరోజు అధికారమదం పట్టిన వ్యక్తులు, అధికార దురహంకారంతో జాతరను అడ్డుకున్నారు... ఆదాల, ఆనంలు అధికార దర్పంతో అమ్మవారి జాతరని అడ్డుకునే రీతిలో నా చేతులు కట్టి వేశారు.. జాతర చేసే పరిస్థితులు లేకపోవడం దూరదృష్టకరమని కోటంరెడ్డి ఆవేదన చెందారు. జాతర నిర్వహించలేని అశక్తుడిగా ఉన్నా... దేవాదాయశాఖ సహకారం లేకుండా అర్చకుల సహకారం లేకుండా మూగ చాటింపు లేకుండా ఎలా జాతరను నిర్వహిస్తానని పేర్కొన్నారు.
అమ్మా మీకన్నీ తెలుసు..: "ఖచ్చితంగా ఒకమాట చెబుతున్నా.. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ కుమార్ రెడ్డి ముందుకు వచ్చి జాతర నిర్వహించారా సరే.. లేదు అనుకుంటే ఖచ్చితంగా జాతర నిర్వహించే రోజు అవకాశం నాకు వస్తుంది.. అమ్మా మీకన్నీ తెలుసంటూ దేవతకు మొర పెట్టుకున్నారు. నాకు అవకాశం వచ్చినరోజు శ్రీ ఇరుకళల అమ్మవారి జాతరను రెండు తెలుగు రాష్ట్రాలలోనే అద్భుతంగా జాతరగా నిర్వహిస్తా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రతి ఇంటి నుంచీ కూడా సద్ది,విశేష ద్రవ్యాలు తీసుకు వచ్చి అమ్మవారి జారతను ఘనంగా నిర్వహిస్తా.. ఖచ్చితంగా జాతర నిర్వహించే రోజు వస్తుంది.. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నా. పరిస్థితులను అర్థం చేసుకోమని కోరుతున్నా అని కోటంరెడ్డి ప్రజలకు విన్నవించారు.
పార్టీకి దూరం కావడంతోనే..: వైఎస్ఆర్ పార్టీకి దూరం అవడంతోనే నన్ను జాతర నిర్వహించకుండా అడ్డుకున్నారని ప్రజలు గమనించాలని కోటంరెడ్డి కోరారు. అమ్మా జాతర అంగరంగ వైభవంగా జరిపించాలి...రాష్ట్రంలోనే పేరెన్నికగల జాతరగా నిర్వహించాలని భావించాను.. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు గణేష్ ఘాట్‌లో వినాయక నిమజ్జన ఉత్సవాలు.. రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో నవరాత్రి ఉత్సవాలు.. అష్టాదశ శక్తి పీఠాల ఉత్సవాలు.. బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ, క్రిస్మస్ సంబరాలు కార్తీక్ దీపాల వేడుకలను వైభవంగా నిర్వహించాం.. ప్రతి ఇంటి నుంచి సద్ది తెచ్చి అందరికీ మేలు చేశా. ఆధ్యాత్మిక జాతరను రాజకీయ జాతరగా మార్చడం దురదృష్టకరం.. వాలంటీరుగా ఉంటాను.. నాపై కోపంతో జాతరను అడ్డుకోవడం మంచిది కాదు.. చైత్ర మాసంలో జరగకపోతే జేష్ట మాసంలోనైనా మరోతేదీ ప్రకటించాలని దేవాదాయ శాఖను కోరారు. తనను చాటింపు వేయకూడదని ఈవో ఆదేశాలిచ్చారని మూగ చాటింపు శీనయ్య భక్తుల ఎదుట తెలిపారు.
ఇవీ చదవండి