భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 వాహక నౌక ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా క్రయోజనిక్ దశలో రాకెట్‌లో సమస్య తలెత్తింది. దీంతో వాహకనౌక.. ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10ని శాస్త్రవేత్తలు ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ వాహకనౌక కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 26 గంటల పాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్ కొనసాగిన తర్వాత వాహకనౌక నింగిలోకి వెళ్లింది.