TDP leader Somireddy latest comments: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రూ.3 వేల కోట్ల సిలికా దోపిడీకి పాల్పడ్డారని.. తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులున్నా.. వారిని బెదిరించి వసూళ్లు చేశారని ధ్వజమెత్తారు. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలకూ భాగస్వామ్యం ఉందంటూ పలు కీలక విషయాలను మీడియా ముందు వెల్లడించారు.
ఓబుళాపురం స్కాంను తలపిస్తుంది: ఈ కుంభకోణంపై నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలికా శాండ్‌కు సంబంధించి రూ.3 వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. మరో ఓబుళాపురం స్కాంను తలపించేలా ఈ కుంభకోణం ఉందని ఆయన ధ్వజమెత్తారు. వేలాది కోట్ల రూపాయల లావాదేవీలపై జీఎస్టీ ఎగవేతపైనా సీబీఐ విచారణ జరపాలని.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం: సిలికా దోపిడీకి సంబంధించిన అంశంపై త్వరలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సోమిరెడ్డి వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 78మంది లింకుదారులకు 300కోట్ల రూపాయల పెనాల్టీ వేసి, వారంతా తమకే సిలికా శాండ్ ఇచ్చేలా మైనింగ్ మాఫియా మెడపై కత్తిపెట్టిందని మండిపడ్డారు. మైనింగ్ మాఫింగ్ వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత విజయ సాయి రెడ్డి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పర్మిట్లు తీసుకుని నెల్లూరు జిల్లాలో తవ్వకాలు జరుపుతున్నారని సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.