ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రి నిధులు స్వాహా చేసిన మహిళా ఉద్యోగి..! - బుచ్చిరెడ్డిపాలెం ఆసుపత్రిలో నిధులు స్వాహా చేసిన మహిళా ఉద్యోగి వార్తలు

ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని తన చాకచక్యంతో పెద్ద ఎత్తున నిధులను పక్కదారి పట్టించింది. ఆసుపత్రి ఉన్నతాధికారులనే బోల్తా కొట్టించింది.. ఫోర్జరీ సంతకాలతో రూ.లక్షలను స్వాహా చేసింది.. కొంతకాలంగా ఈ వ్యవహరం నడుస్తున్నా.. ఎవరి కంట పడకుండా పనులను చక్కదిద్దింది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ నిధుల వ్యవహారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది.

health care centre woman employee fraud in nellore district
ఆసుపత్రి నిధులు స్వాహా చేసిన మహిళా ఉద్యోగి

By

Published : Jun 14, 2020, 5:52 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయి. అక్కడ జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నీలిమ ఆసుపత్రికి సంబంధించిన రూ.లక్షల నిధులను ఎవరికీ తెలియకుండా స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

నీలిమ 2017 నుంచి అక్కడ ఉద్యోగినిగా కొనసాగుతోంది. జూనియర్‌ అసిస్టెంట్‌ కావటంతో నిధులకు సంబంధించిన ఫైళ్లను ఆమె ఉన్నతాధికారుల వద్దకు పంపుతుండేది. మెడికల్‌ సూపరింటెండెంట్, మెడికల్‌ ఆఫీసర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను పక్కదారి పట్టిస్తూ వచ్చింది. ఇలా కొంత కాలంగా నడుస్తున్నా.. ఈ వ్యవహారాన్ని అక్కడున్న అధికారులు గుర్తించలేదు. నిధుల ఖర్చులకు సంబంధించి ఆమె అంతా చూసుకుంటుండటంతో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోలేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడికక్కడ ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా చేసింది.

నిధుల స్వాహాపై ఫిర్యాదు

బుచ్చిరెడ్డిపాలెం మండలం సీహెచ్‌సీలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ నీలిమ రూ.43 లక్షలను ఆస్పత్రి ఉన్నతాధికారుల సంతకాలతో ఫోర్జరీ చేసి దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్‌బాబు తెలిపారు.

విచారణలో అధికారులు

సీహెచ్‌సీలో జరిగిన అవకతవకలపై ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు అధికారులతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. బ్యాంకు స్టేట్‌మెంట్లు, చెక్కులు, తదితర అంశాలపై కూపీ లాగుతున్నారు. పూర్తిస్థాయిలో వివరాలు ఇంకా వెలువడాల్సి ఉందని ఆస్పత్రి ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి చెన్నయ్యను ‘వివరణ కోరగా.. నిధులు పక్కదారి పట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందని తెలిపారు.

అన్నీ తారుమారు..

ఆసుపత్రి అవసరాలకు ఎలాంటి ఖర్చులు చేయాలన్నా.. బ్యాంకు ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బ్యాంకు చెక్కుల ద్వారా అవసరమైన డబ్బులను తీసుకొస్తూ నిధుల ఖర్చును నడిపిస్తారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. బ్యాంకు చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు స్టేట్‌మెంట్లను సైతం తారుమారు చేసినట్లు ఆస్పత్రి వర్గాల సమాచారం. సూపరింటెండెంట్, మెడికల్‌ ఆఫీసర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి కథ నడిపిస్తున్నా.. ఇన్నాళ్లు బయట పడకపోవడం గమనార్హం.

ఇదంతా అక్కడున్న వారికి తెలియకుండానే జరుగుతోందా అనేదీ విచారణలో తేలాల్సి ఉంది. ఆస్పత్రికి ఏటా రూ.5 లక్షలు మేర హెచ్‌డీఎస్‌ నిధులు వస్తుంటాయి. వీటితో ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు, మందులు, అత్యవసర కొనుగోళ్లు చేయవచ్చు. రికార్డులు, ఉద్యోగుల ఖర్చులు, ఇతరత్రా వాటికి ఈ నిధుల వ్యయం జరుగుతోంది. ఇలాంటి వాటిల్లోనూ నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి...

జిల్లాలో ఆశాజనకంగా లేని ఇంటర్‌ ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details