నెల్లూరు జిల్లా ఉదయగిరిలో విషాదం జరిగింది. తల్లి మందలించిందన్న మనస్థాపంతో ఓ బాలుడు బావిలో దూకి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అనే బాలుడి (14) తల్లిదండ్రులు పట్టణంలోని ఆనకట్ట సమీపంలో నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నారు. బాలుడు రోజూ ఉదయగిరికి వచ్చి ఇంటికి నీటిని పట్టి వెళ్లేవాడు. సెల్ ఫోన్ విషయంలో అక్కతో ఘర్షణ పడటంతో తల్లి మందలించింది.
అనంతరం సోదరుడితో కలిసి ఉదయగిరికి వచ్చాడు. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన ఆ పిల్లవాడు తిరిగి రాలేదు. బంధువులు వెతకగా ఆచూకీ లభించలేదు. కృష్ణ మందిరం సమీపంలో నేలబావి వద్ద పిల్లవాడి చెప్పులు ఉన్నాయని తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మోటార్లతో బావిలో నీరు తోడగా రాత్రి మృతదేహం బయటపడింది. ఘటనా స్థలాన్ని సీఐ ప్రభాకర్‌రావు పరిశీలించారు.