ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలకు రుచులు.. రైతులకు మేలు!

సింహపురికి ‘సీమ’ అరటి వస్తోంది.. నెల్లూరు వాసులను కడప, అనంత కదళీఫలం పలకరించనుంది. కరోనా కష్టాలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యాన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాక.. ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వృథాగా పోతున్న ఉద్యాన దిగుబడులను రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది. తొలి విడతలో అరటిని సరఫరా చేయనుండగా.. మలివిడతలో మరికొన్ని పండ్లను పంచేందుకు చర్యలు చేపట్టింది.

banana distribution to every house in state by ap government
ప్రతి ఇంటికి అరటిపండ్లు పంపిణీ

By

Published : Apr 23, 2020, 6:35 PM IST

పొలాల్లో వృథాగా పోతున్న పండ్లను ప్రజలకు చేరువ చేయడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించటంతో పాటు.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉద్యానశాఖ, సెర్ప్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా రైతుల నుంచి అరటిపండ్లను సేకరించి వెలుగు సభ్యుల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా ఆ పండ్లను అందించాలని ప్రణాళిక వేసింది. తద్వారా ప్రతి ఇంటికీ కదళీఫలం చేరేలా నిర్ణయించారు. ప్రస్తుతం ఆ క్రమంలోనే పంపిణీ మొదలైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం నుంచి అధికారులు ప్రక్రియ చేపట్టారు.

ఇతర ఉత్పత్తులపై అభ్యర్థన

జిల్లాలో మంగళవారానికి 668 మెట్రిక్‌ టన్నుల అరటి పంపిణీకి అవసరమని అధికారులు ఇండెంట్‌ పెట్టారు. ఇందులో 550 మెట్రిక్‌ టన్నుల మొత్తాన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఆమోదించాయి. ఇందులో 317 మెట్రిక్‌ టన్నుల అరటిపళ్లు జిల్లాకు చేరాయి. ప్రస్తుతం వాటిని పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ 2 కిలోలు ఇవ్వగా.. పండ్లు మిగిలిన పక్షంలో మరో విడతగా కుటుంబానికి అదనంగా 2 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇక్కడ కేవలం అరటి మాత్రమే కాదు.. ఉద్యానశాఖ పరంగా ఉన్న కళింగర, పుచ్చ, చీనీ, బొప్పాయి, తదితర రకాల పంపిణీపైనా యోచన జరుగుతోంది.

ప్రస్తుతం నెల్లూరులోనూ అరటి, చీనీ, నిమ్మ తదితరాలు విరివిగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రైతులు అరటి తోటలను నరికేసుకుంటోన్న దుస్థితి ఉంది. ఈ స్థితిలో జిల్లాలోని ఉత్పత్తులను సేకరించి ప్రజలకు అందిస్తే రైతుకు మేలు జరుగుతుంది. రవాణా ఛార్జీలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. పంపిణీ విషయమై డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శీనానాయక్‌ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరటి పంపిణీ ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పంపిణీ ఇలా చేస్తారు.

నెల్లూరు జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. వీవోల ద్వారా పంచాయతీల వారీగా ఎంత అరటి కావాలో వెలుగు ఏపీఎంలు ఇండెంట్‌ సమర్పిస్తారు. ప్రతి మండలంలోనూ రోజుకు కనిష్ఠంగా 7 టన్నుల నుంచి గరిష్ఠంగా 84 టన్నులు ఇండెంట్‌ పెట్టేలా పరిమితి విధించారు. ఈ నివేదిక మేరకు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సరకును తెస్తారు. జిల్లాలో అరటిసాగు లేని ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని 31 మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి. పల్లెల స్థాయికి ఏఎంసీ ఉచితంగా సరఫరా చేస్తుండగా.. ఇంటింటికీ కిలో రూ.2 మార్జిన్‌తో వీవోలు అందజేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు.

ఇవీ చదవండి..'మళ్లీ మంచి రోజులు.. రైతులు అధైర్యపడొద్దు'

ABOUT THE AUTHOR

...view details