Atmakur Bypoll: శ్రీపొట్టి శ్రీరాములు (ఎస్‌పీఎస్‌ఆర్) నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇవాళ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకాపా తరఫున మేకపాటి విక్రమ్‌రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్ యాదవ్, మరో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,13,400 మంది ఓటర్లకు 279 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు.. 78 వెబ్‌క్యాస్టింగ్ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్.చక్రధర్‌బాబు వెల్లడించారు. ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపఎన్నిక స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
పోలింగ్ విధుల్లో 1,409 మంది సిబ్బంది..ఉపఎన్నిక నిర్వహణకు మొత్తం 1,409 మంది అధికారులు, ఇతర సిబ్బందిని నియమించినట్లు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 198 ప్రాంతాల్లో 279 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 363 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, 391 వీవీ ప్యాట్స్‌ను పంపిణీ చేశారు. సమస్యాత్మకమైన 123 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.