కొవిడ్ నివారణకు అందరూ కలిసికట్టుగా తమ వంతు విధులు నిర్వర్తించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన కొవిడ్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. గుర్తించిన కొవిడ్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ వారికి కేటాయించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలనూ వివరించారు. పడకల ఖాళీలు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందిస్తున్న మందులు, ఆక్సిజన్ పడకల వివరాలు, 104 ద్వారా అందుతున్న సేవలపై నిత్యం సమీక్షిస్తూ ఆ వివరాలు తెలియజేయాలని కలెక్టర్‌కు సూచించారు. నెల్లూరు ఆసుపత్రిలో జర్మన్ సాంకేతికతతో ఒక షెడ్ ఏర్పాటు చేశారని, మరో మూడు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు.