A Special App to Control Fire: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే ఘటనా స్థలాలకు వెళ్లేందుకు అగ్నిమాపక, పోలీస్ శాఖలు ఒక యాప్‌ను రూపొందించనున్నాయి. నగరం నలుమూలల్లో నిప్పంటుకున్న ప్రాంతాలకు ఫైరింజన్లు వేగంగా రావడం లేదన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఇందుకు పూనుకున్నారు.
ట్రాఫిక్‌జాంలో చిక్కుకోకుండా..:నగరంలోని అగ్నిప్రమాదాలు జరిగిన ప్రదేశం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే.. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఫైరింజన్లు చేరుకోవడానికి 15-20నిమిషాలు పడుతుంది. ఈలోపు మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రత్యేకయాప్ ఉపకరిస్తుంది.
- ప్రమాద సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయగానే... ఆ ప్రాంతాన్ని యాప్ జియోట్యాగింగ్ చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ పోలీసుల మ్యాప్‌ను అనుసంధానిస్తుంది.
- ఘటన స్థలాలకు వెళ్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు, ఫైరింజన్‌తోపాటు ఉన్న సిబ్బంది మొబైల్ ఫోన్లలో జీపీఎస్ యాక్టివేట్ అవుతుంది. యాప్ చూపించే మార్గాన్ని అగ్నిమాపకశాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులకు వివరించగానే... వారు అప్రమత్తమై ఫైరింజన్ వచ్చేమార్గంలో ట్రాఫిక్‌జాం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.