50 Rupees Doctor in Kavali: వైద్యుడంటే ఓ సలహాదారుడు, మార్గదర్శి, శ్రేయోభిలాషి, ప్రాణ రక్షణకుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే దైవ సమానుడు..!. ఒక ప్రాణాన్ని నిలబెట్టినప్పుడో, ప్రమాదకరమైన సమస్యను గుర్తించి.. చికిత్స చేసినప్పుడో ఆ డాక్టర్లలో కలిగే ఆ సంతృప్తే వేరు. అలాంటి తృప్తి, సంతృప్తి పొందాలంటే కచ్చితంగా వైద్య వృత్తిపై ఓ నిబద్ధత, ప్రణాళికా, అమితమైన ఇష్టం, సేవ గుణం వంటి తదితర లక్షణాలు ఉండాలి. సరిగ్గా అలాంటి లక్షణాలతో.. 96 ఏళ్ల వయసులో గత 50 సంవత్సరాలుగా కేవలం 50 రూపాయలకే వైద్య సేవలు అందిస్తూ.. ప్రజల వైద్యుడిగా పేరుగాంచారు నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి. అంతేకాదు, వైద్య వృత్తిపై ఆయనకున్న అంకిత భావం, గౌరవం, సేవ గుణాన్ని చూసి.. పిల్లలు, వారి బిడ్డలు సుమారు 34 మంది డాకర్లు అయ్యారు. మరి, ఆలస్యంగా చేయకుండా డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి జీవితం, చదువు, పిల్లలు, సేవ కార్యక్రమాల గురించి తెలుసుకుందామా..
Medical Services Start at 10 Rupees in Kavali: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పెనుబల్లికి చెందిన డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి.. 96ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా వైద్య సేవలు అందిస్తున్నారు. 1927లో పెనుబల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. ఎంతో కష్టపడి చదివి వైద్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జిల్లా వైద్యాధికారిగా విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ తరువాత పేదల కోసం కావలిలో ఓ వైద్యశాల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన వైద్యశాలలో వైద్యంతో పాటు ఉచితంగా మందులు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు కేవలం 10 రూపాయలు మాత్రమే ఫీజుగా తీసుకునేవారు. ఇప్పడు 50 రూపాయలకు పెంచారు. కావలి నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈయన దగ్గరకు పదుల సంఖ్యలో రోగులు వస్తుంటారు.
Dr.Lakshminarasa Reddy Life Details: ఇక, లక్ష్మీనరసారెడ్డికి కుటుంబ విషయానికొస్తే.. ఆయనకు 8 మంది తోబుట్టువులు. అంతా వైద్య వృత్తిలోనే ఉన్నారు. ఆయన మనవళ్లు, మనుమరాళ్లతో కలిపి మొత్తం 34 మంది డాక్టర్లయ్యారు. దీంతో ఆయన కుటుంబం వైద్య కుటుంబంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. లక్ష్మీనరసారెడ్డి మంచి టెన్నీస్ ప్లేయర్ కావడంతో.. నేటికి ఆయన ఆరోగ్యంగావైద్యం చేస్తున్నారు. అంతేకాకుండా, వైద్యంతో పాటు ఆయన సామాజిక సేవలోనూ ముందుంటారు. రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ద్వారా పేదలు, విద్యార్థులకు సేవలందిస్తున్నారు. నరసారెడ్డి సతీమణి, కుమారులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్నారు.