Women Protest For Drinking Water At Municipal Office : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో పట్టణ మహిళలు, పలువురు పురపాలక కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు : తాగునీటి సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణ మహిళలు ధ్వజమెత్తారు. గతంలో రోజు తప్పించి రోజు కుళాయికి నీరు ఇచ్చేవారని ప్రస్తుతం ఐదు రోజులకు ఒకసారి ఇస్తున్నారనీ, ఇచ్చిన నీరు కూడా మంచిగా ఉండటం లేదని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా వినతి పత్రాలు, నిరసన రూపంలో తమ సమస్యను అధికారులకు వివరించామని అన్నారు. అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరిగిన నీటి అవసరాలు :తాగునీటి కోసం ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న పట్టణ ప్రజలకు మాత్రం ఏడాది పొడుగునా నీటి కష్టాలు వేధిస్తున్నాయని సీపీఎం నాయకులు అన్నారు. వేసవి రోజుల్లో నీటి అవసరాలు పెరిగాయని ఆ మేరకు సరఫరా కాకపోవడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు మాత్రం నీటి సమస్యకు పరిష్కారం చూపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.