AP JAC Amaravati president Bopparaju Venkateswarlu: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం సరైనది కాదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరిగిన మూడో విడత నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ సస్పెన్షన్లు, వేధింపులు నిలిపివేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమాల్లో ద్వారా తెలియజేశామని బొప్పరాజు తెలియజేశారు. కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఇప్పటికీ.. రెండు దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మూడో విడత కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలోని కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
బోధనేతర పనులను అప్పగించి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పుస్తకాలు పంపిణీ చేయకుండా ఆ నెపాన్ని అధికారులపై వేసి.. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పార్వతిపురం మన్యం జిల్లాలో డీఈవో, ఎంఈఓ, జీసీడీఓ, ఎస్వోలను సస్పెండ్ చేయడం సరైనది కాదన్నారు. డీఈవో, జీసీడీవోల సస్పెన్షన్ రద్దు చేసినట్లే మిగతా ఇద్దరిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులపై ఉన్న సస్పెన్షన్స్ అన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, డీఏ, పీఆర్సీ అరియర్స్ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు.