Language Teachers Association Meeting: భాషా ఉపాద్యాయులకు పదోన్నతి కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఏ మాత్రం ఆర్థిక భారం లేకపోయినా ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. విజయవాడలోని రాష్ట్ర భాషా ఉపాధ్యాయుల సంస్థ కార్యవర్గ సమావేశంలో భాషా పండితులు అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భాషా పండితులంతా నల్లరిబ్బన్లతో నిరసన తెలపాలని సమావేశంలో తీర్మానించారు. జీతం ఇతర ఉపాధ్యాయులతో సమానంగా ఇస్తున్నా.. కేడర్ విషయంలో సమాన గౌరవం లభించడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తించే వారమని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వృత్తిని అవమానించడమే..ఉపాధాయ అర్హత పరీక్ష మొదటి పేపర్ తాము రాయనందుకు తమను.. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించడం కుదరదని భాషా పండితులు ఆవేదన చెందుతున్నారు. తమని భాషా పండితులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల్లో తమకు ఐదు సార్లు వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా పండితులు అన్న పోస్టుని తొలగించడం తాము చేస్తున్న వృత్తిని అవమానించడమేనని అసహనం వ్యక్తం చేశారు. తమకి తక్షణమే పదోన్నతులు కల్పించాలని లేకపోతే తమకు తీరని అన్యాయం చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1134 మంది భాషా పండితులు ఉన్నారని వారి అభిప్రాయాలను గౌరవించి ప్రభుత్వం పోస్టులు తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు.