Telangana New Secretariat : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే తదుపరి మంచిరోజున సచివాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో సర్కార్ ఉంది. ఐతే ఈనెల 18న కంటివెలుగు రెండోవిడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండడంతోపాటు ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలిసభ కావడంతో పార్టీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది.
Telangana New Secretariat inauguration : సచివాలయానికి సంబంధించిన తుదిపనులు ఇంకా కొనసాగుతుండటంతో నెలాఖరులోపు ప్రారంభించాలన్న ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే మొత్తం భవనం లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరోఅంతస్థు, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థు సిద్ధం చేసి ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐతే ఇప్పటివరకు సచివాలయభవన ప్రారంభంపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు, సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు.
ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి. భవనంముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు సమాంతరంగా సాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడం సహా వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని గుత్తేదారుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.