ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ ఆసుపత్రిలో సగానికి తగ్గిన ఓపీ కౌంటర్లు.. కారణం తెలిస్తే షాక్​ అవడం పక్కా..!

VIJAYAWADA GGH : ఆసుపత్రి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఓపీ. డాక్టర్​ చెకప్​ కోసం హాస్పిటల్​కి వెళ్లినప్పుడు ఓపీ తప్పనిసరి. సహజంగా ఓపీ కోసం క్యూలైన్లరో ఓ అరగంట.. మహా అయితే ఇంకో గంట ఎదురుచూస్తాం. అలా కాకుండా నాలుగు గంటల పైనే లైన్లో నిలబడితే.. అదే పరిస్థితి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మీకు సందేహం రావొచ్చు.. విజయవాడ హాస్పిటల్​ అంటే పెద్దది కదా.. అందుకనే లేట్​ అయ్యిందేమో అని. అలా అనుకుంటే మీరు పొరపాటుపడ్డట్లే. అసలు విషయం తెలిస్తే ఖంగుతింటారు.

VIJAYAWADA GGH
VIJAYAWADA GGH

By

Published : Mar 1, 2023, 9:46 AM IST

VIJAYAWADA GGH : సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు, మధ్య తరగతి ప్రజలు వస్తుంటారు. ఖర్చు ఉండదనే భావంతో ఎక్కువ మందే వస్తారు. అయితే ఏ ఆసుపత్రిలోనైనా ఓపీ విధానం ఉంటుంది. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో అయితే చెప్పక్కర్లేదు. అయితే చాలా మంది ఓపీ కోసం అయినా ఉదయం పూట ఆసుపత్రికి వచ్చి క్యూలైన్లో నిల్చుంటారు. ఓపీ ఆలస్యం అయితే డాక్టరు చూడటానికి సమయం పడుతుందని ఆలోచించి మరీ పొద్దున్నే వస్తారు. మరి అలాంటి ఓపీ ఆలస్యం అయితే.. గంట సేపు నిలబడాల్సిన దగ్గర నాలుగు గంటలు నిలబడితే.. అసలే ఆరోగ్యం బాగలేక వచ్చిన వారు క్యూలైన్లలో నిలబడి ఇంకా అనారోగ్యానికి గురవుతే.. ఇదే పరిస్థితి ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఉంది.

విజయవాడ ప్రభుత్వ ఆస్పతి అంటే తెలియని వారుండరు. ఇక్కడికి కేవలం ఎన్టీఆర్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలు నుంచి నిత్యం వందలాదిగా రోగులు మెరుగైన వైద్యం కోసం వస్తుంటారు. నిత్యం ఇక్కడ ఓపీ కోసం 2500 నుంటి 3 వేల మంది రోగులు వస్తుంటారు. అయితే ఓపీ చీటీలు ప్రింట్​ చేసే మిషన్​లో ఇంకు అయిపోయిందనే కారణంతో గత మూడు రోజుల నుంచి 4 ఓపీ కౌంటర్లను మూసివేశారు.

"ఆసుపత్రిలో సిబ్బంది మానేయడం.. వేరే ఉద్యోగాలకు వెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలోనే ఓపీ కౌంటర్లను సగానికి తగ్గించాం. క్యాడ్రిడ్జ్​ సమస్య అనేది శాశ్వతమైనది కాదు. దానిని వెంటనే పరిష్కరిస్తాం. రేపటి నుంచి అన్ని ఓపీ కౌంటర్లను ఓపెన్​ చేస్తాం. సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లడం వల్ల త్వరగా నియమించలేకపోతున్నాం"-డాక్టర్​ సౌభాగ్యలక్ష్మీ, జీజీహెచ్​ సూపరింటెండెంట్​

ఆసుపత్రి లోపల ఉన్న ఓపీ కౌంటర్లు మూసివేయడంతో వందలాది మంది రోగులు ఆరుబయట గతంలో ఏర్పాటు చేసిన 4 అదనపు కౌంటర్ల వద్ద కిక్కిరిసిపోయారు. గంటల కొద్ది క్యూలో ఎదురుచూడలేక అవస్థలు పడ్డారు. వేలాదిగా వస్తున్న రోగులకు ప్రస్తుతం ఉన్న 8 కౌంటర్లే సరిపోవడం లేదంటే.. తాజాగా గత నాలుగు రోజుల నుంచి సగం కౌంటర్లు మూసివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిల్లులు సరిగా చెల్లించని కారణంగా.. సకాలంలో ప్రింటర్లలో ఇంకు అమర్చడం లేదని చెబుతుండగా.. ఆసుపత్రి సూపరింటెండెంటు మాత్రం ఈ సమస్య తన వద్దకి రాలేదని చెబుతున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందనేది వాస్తవమని.. ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details