Janasena spokesman Mahesh Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఆగ్రహించారు. సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా విష సంస్కృతులకు, వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ నిలయంగా మార్చేశారని వ్యాఖ్యానించారు.
పండుగ ముసుగులో సీఎం జగన్, సజ్జల, వైసీపీ నాయకులు.. ప్రజల దగ్గర నుంచి వందల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. కోడి పందేల ముసుగులో బరుల చుట్టూ గుండాట, పేకాట, మూడుముక్కలాట, కోతాట, జూదం వంటివి విపరీతంగా జరిగాయన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని, జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్లన్నీ విచ్చలవిడిగా అమ్ముడుపోయాయన్నారు. ఈసారి వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి కాదు.. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదించారన్నారని విమర్శించారు. డబ్బు పిచ్చితో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను వ్యసనపరులుగా చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక కోడిపందేల బరుల చుట్టూ గుండాట, పేకాట, మద్యం, సిగరెట్లు, గంజాయిని అమ్ముకొని సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్నారన్నారు. ప్రజా సమస్యల మీద.. ప్రజలు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 పేరుతో కేసులు పెట్టి, పోలీసులు సమాజాన్ని సర్వం నాశనం చేస్తున్నారని గుర్తు చేశారు. వివిధ జిల్లాల్లో గుండాట, పేకాట, కోతముక్కలపై పోలీసులు ఎందుకు మౌనం వహించారో రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి బరికి ఒక ప్యాకేజీ ఏర్పాటు చేసి, ఆ ప్యాకేజీలో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర పోలీస్, రెవెన్యూ, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, సజ్జల కలిపి పంచుకున్నారని అని ఆరోపించారు.