TDP leaders Complaint to Governor on YCP Attacks: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు వాహనంపై నాలుగు రోజులక్రితం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై టీడీపీ ముఖ్య నేతలు ఈరోజు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా ఆరోజు మంత్రి సురేశ్, పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. కీలక విషయాలను వెల్లడించారు.
చంద్రబాబుపై 11 సార్లు దాడికి పాల్పడ్డారు.. టీడీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పర్యటనలను వైఎస్సార్సీపీ అడ్డుకుంటున్న విధానంపై విచారణ కమిటీ వేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరామన్నారు. యర్రగొండపాలెంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని రాళ్ల దాడి చేసిన ఘటన విధానాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు 11 సార్లు దాడులు సృష్టించారని.. ఆ ఘటనలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు వివరించి, వీడియోలను కూడా అందచేశామన్నారు.
వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి..అనంతరం మంత్రి సురేశ్ యర్రగొండపాలెంలో చొక్కా విప్పిన వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. వీధి రౌడీలా ప్రవర్తించిన మంత్రి సురేశ్‌ని వెంటనే బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్‌తో చర్చించగా.. మంత్రి సురేశ్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సభలు, కార్యక్రమాలపై పోలీసుల సహకారంతో అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. యర్రగొండపాలెం ఘటన, ఎన్ఎస్జీ కమాండోకు గాయాల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేసేందుకు రాష్ట్ర పోలీసులను వాడుకుంటున్న అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.