Beneficiaries Suffering in Jagananna Colonies: ఎన్టీఆర్ జిల్లా మైలవరం సమీపంలోని పూరగుట్ట జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇళ్ల నిర్మాణానికి సరిపోవడం లేదని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న లక్షా ఎనబై వేల రూపాయలు ఇళ్ల పునాదుల నిర్మాణానికి సరిపోతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి సుమారు తొమ్మిది లక్షల వరకు ఖర్చు అవుతోందని అంటున్నారు. లబ్ధిదారుల వద్ద ఇంటి నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు. చేసిన అప్పు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుతం ఇస్తున్న లక్షా ఎనబై వేలు కాకుండా.. ఇంకా పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని.. దీంతో భయపడి అధికంగా అప్పులు చేసి ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పాలని కోరగా.. తమకు వచ్చే పథకాలు రాకుండా చేస్తారేమోనని వారు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతానికి నిర్మాణాలు పూర్తి చేసిన కొంతమంది గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం ఊరికి దూరంగా ఉండడంతో కరెంట్ సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించకపోవడంతో గృహ నిర్మాణదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతానికి రావడానికి నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.