Drinking Water Problem Before Summer: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రజలకు తాగునీరందించాలన్న లక్ష్యంతో 2019లో శంకుస్థాపన చేసిన మంచినీటి సరఫరా పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆసియా మౌళిక వసతుల కల్పన బ్యాంక్ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2019లో మంచినీటి సరఫరా పనులకు గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. త్వరగతిన మంచినీటి సరఫరా పనులు పూర్తి చేసి తిరువూరు ప్రజలకు తాగునీరు అందించాలని భావించింది.
2019 ఎన్నికల కోడ్ అడ్డురావడంతో గత టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తిచేయలేకపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ పనులు నిలుపివేసింది. రివర్స్ టెండరింగ్ ఇచ్చి పనులు ప్రారంభించినా పనుల్లో తీవ్ర జాప్యం నేటికీ కొనసాగుతుంది. చేసిన పనులకు నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు కొంతకాలం పనులు ఆపేశారు. ప్రస్తుతం పనులు చేస్తున్నా నత్తనడకన సాగుతున్నాయి.
కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మందుకు సాగలేదు. ప్రస్తుతం పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుంతం పది నుంచి పదిహేను ఇళ్లకు ఒక్క కుళాయి ద్వారా తాగు నీటినీ సరఫరా చేస్తున్నారు. కుళాయి నీటిని సరఫరా చేసే పైపులు రంద్రాలు పడడంతో చుట్టూ ఉండే మురుగు నీరు కళాయి పైపుల్లోకి పోతుంది. దీంతో ట్యాంకుల్లో నీటిని శుద్ధి చేసినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు చెబుతున్నారు. పైపులు మరమత్తుకు వచ్చి వారాలు గడుస్తున్నా సరి చేయడం లేదని ప్రజలంటున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న తాగునీరు మూడు రోజులకు ఒక్కసారి వస్తున్నాయని తిరువూరు ప్రజలు చెబుతున్నారు. అందజేస్తున్న మంచినీరు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని వాపోతున్నారు.