Crop Damage With Michaung Cyclone :మిగ్‌జాం తుపాను ప్రభావం తగ్గినా అన్నదాతను మాత్రం కష్టాలు వీడటం లేదు. వరి చేలు, కూరగాయల పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. నేలవాలిన వరి చేల నుంచి మొలకలు వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను మూలంగా పంట దెబ్బతిన్నప్పటికీ కొద్దోగొప్పో దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. పంట చేలను వీడని ముంపు మూలంగా కనీసం ఆ దిగుబడి కూడా రాదని తెలిసీ రైతులు నిట్టూరుస్తున్నారు.
Michaung Damages Crops in NTR District :మునిగిపోయిన వరి పనలను కాపాడేందుకు ఎన్టీఆర్ జిల్లా షాబాద గ్రామ రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తుపాను వారిని దెబ్బ మీద దెబ్బ కొట్టింది. తుపాను వల్ల దాదాపు జిల్లా వ్యాప్తంగా రైతులు దెబ్బతిన్నారు. ఇప్పటికీ కూడా రైతులు తుపాను నుంచి కోలుకోవడం లేదు. బుడమేరు వాగు నుంచి వచ్చిన ముంపే ఇందుకు ప్రధాన కారణం. వందలాది ఎకరాల వరి, కూరగాయల పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రభావానికి వరి పంట పూర్తిగా దెబ్బతింది. పంట పొలాలు ఎండిపోయాక మిషన్లతో కోస్తే ఎంతోకొంత దిగుబడి వస్తుందని రైతులుంతా ఆశించారు. ఇప్పుడు వారి అశ అంతా అడియాసే అయింది. నీటిలో వాలిపోయిన వరి పనలు కుళ్లిపోతున్నాయి.
ప్రకృతి విపత్తుకు తోడైన పాలకుల నిర్లక్ష్యం- రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
Farmers Affected by Cyclone Michaung :చాలా చోట్ల నేలవాలిన వరి చేల నుంచి మొలకలువస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. అప్పులు తెచ్చి 20, 30 ఎకరాలు కౌలు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మిగిలింది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక కళ్లనీరు పెట్టుకుంటున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటల వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు మండిపడుతున్నారు. పంటలు దెబ్బతిన్న తరుణంలో మళ్లీ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.