ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎస్​తో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం.. చర్చలు సఫలమేనా..! - AP Employees Union Leaders talks with Govt

AP Employees Union Leaders talks with Govt: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హెల్త్ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్ వంటి తదితర అంశాల గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మట్లాడుతూ.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

employees leaders
employees leaders

By

Published : Mar 24, 2023, 10:56 PM IST

Updated : Mar 24, 2023, 11:03 PM IST

AP Employees Union Leaders talks with Govt: ఉద్యోగుల ఆరోగ్య పథకం, పీఆర్సీ బకాయిలపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం మరోసారి సమావేశం నిర్వహించింది. సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి.. ఆర్ధిక శాఖ, సాధారణ పరిపాలన, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నుంచి నేతలు బొప్పరాజు, బండి, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరై.. మరోమారు డిమాండ్ల గురించి ప్రస్తావించారు.

నేడు జరిగిన సమావేశంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించి ఉద్యోగులు-ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని ఆర్ధిక శాఖ వద్ద కాకుండా, ఆరోగ్యశ్రీ ట్రస్టు వద్ద ఉంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. పీఆర్సీలో పెండింగ్ అంశాలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్​మెంట్ గడువు 2024 వరకూ పొడిగించాలన్న ప్రతిపాదన ఆర్ధికశాఖ వద్ద ఉందని వెల్లడించారు. జీపీఎఫ్ రుణాలు, ఇతర బిల్లుల చెల్లింపులనూ ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

సీఎస్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశం

ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది: సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హెల్త్ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్ వంటి తదితర అంశాలపై చర్చించామన్నారు. కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ''ఉద్యోగుల హెల్త్ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్ అంశాలపై నేడు మరోసారి ప్రభుత్వంతో చర్చించాం. ఉద్యోగులకు నగదు రహిత చికిత్సలను అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయగా.. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పేస్కేళ్ల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి సమాధానాన్ని చెప్పలేదు. వైద్యారోగ్య శాఖలో రేషనలైజేషన్‌‌పై ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరాం. ఏపీజీఎల్ఐ గడచిన ఆరు మాసాలుగా జమ కాలేదన్న విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేశాం'' అని ఆయన అన్నారు.

ఆ మొత్తాన్ని ట్రస్టు వద్దే ఉంచాలి:హెల్త్ కార్డుకు సంబంధించి ఉద్యోగులు తమ వాటా చెల్లించినా ఉపయోగం లేకుండా ఉందని.. ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈహెచ్ఎస్‌తోపాటు పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం నిర్వహించిన చర్చలకు హాజరైన ఆయన.. ఉద్యోగులు- ప్రభుత్వం చెల్లించే మొత్తాన్ని ట్రస్టు వద్ద ఉంచాల్సిందిగా డిమాండ్ చేసినట్టు తెలిపారు. 104 టోల్ ఫ్రీ నెంబరు పెట్టినా.. దాని వల్ల సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు. నగదు రహిత చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్నాన్ని కోరామన్నారు.

ఏప్రిల్ 5న భవిష్యత్తు కార్యాచరణ :ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల్లో తలెత్తుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేకపోయిందన్నారు. పీఆర్సీ అరియర్స్ ఎంతమేర ఉన్నాయో లెక్కించలేదని ప్రభుత్వమే చెప్పిందన్నారు. పీఆర్సీ కమిషనర్ సిఫార్సు చేసిన పేస్కేళ్లను ప్రభుత్వం ఇవ్వలేదని ఆక్షేపించారు. వివిధ అంశాలపై అవగాహన కోసమే మళ్లీ ప్రభుత్వం ఉద్యోగులతో సమావేశం నిర్వహించిందన్నారు. డీఏ అరియర్లు, పీఆర్సీ అరియర్లను వేర్వేరుగా చూడాలన్నారు. డిమాండ్లను నెరవేర్చే వరకూ తమ ఉద్యమ కార్యాచరణ యథావిధిగానే కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం మార్చి 27వ తేదీన చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల ఇళ్లకు సందర్శనకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 5వ తేదీన ఉద్యోగ సంఘాల నేతలంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.

ఈ నెలాఖరులోగా రూ.1,554 కోట్లు చెల్లింపు:ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఉద్యోగి-ప్రభుత్వం చెల్లించే కంట్రిబ్యూషన్ సొమ్మును ట్రస్టుకు బదిలీ చేయాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈహెచ్ఎస్‌లో ఇబ్బందుల కోసం 104 టోల్ ఫ్రీలో ఆప్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. గత నెలలో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ. 3 వేల కోట్లలో ఇప్పటివరకూ రూ. 2,660 కోట్లు ఇచ్చినట్టు వివరించారు. సీపీఎస్ ఉద్యోగులు-ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మొత్తం రూ.1,554 కోట్లు నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. పెండింగ్ డీఏలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశామని తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 24, 2023, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details