CM Jagan Key instructions issued to SIPB officers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డితోపాటు పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి.. పలు సంస్థలిచ్చిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేశారు.
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి..తాడేపల్లిలో ఈరోజు ముఖ్యమంత్రివైఎస్ జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్.. SIPB అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు సహా అన్ని రకాల పరిశ్రమల్లో.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చేసిన చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించారు. చట్టం అమలు జరుగుతోన్న తీరుపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి ఆరు నెలలకొకసారి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసే సంస్థలు ఏవైనా.. కనీస మద్దతు ధరకు తప్పక కొనుగోలు చేయాల్సిందేనని.. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పలు ప్రాజెక్టులకు SIPB ఆమోద ముద్ర..అనంతరం వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లె మండలం అశోక్ నగర్, బక్కన్నవారి పల్లె వద్ద జేఎస్‌డబ్ల్యూ (JSW) నియో ఎనర్జీకి చెందిన హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు.. SIPB ఆమోదం తెలిపింది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ.. 2,450 కోట్లతో ప్రతిపాదించిన సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు విశాఖ జిల్లా అన్నవరంలో రూ.525 కోట్ల పెట్టుబడితో మేఫెయిర్ హోటళ్లు, రిసార్టులు ఏర్పాటుకు, తిరుపతి పేరూరు వద్ద రూ.218 కోట్లతో.. హయత్ హోటల్ నిర్మాణానికి, విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద..రూ.1200 కోట్లతో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు SIPB ఆమోద ముద్ర వేసింది.