YSR Sampoorna Poshana Kits: వంద కోట్ల అంచనాలకు పైబడిన టెండర్ల విధివిధానాలను పరిశీలించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూని ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల సరఫరా కోసం పిలిచిన టెండర్‌ను ప్రివ్యూకి ఎందుకు పంపలేదని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మొదటిసారి పిలిచిన టెండర్‌ను రద్దు చేసి రెండోసారి టెండర్‌కు పిలవడానికి, నిబంధనల్లో మార్పులు చేయడానికి కారణాలేంటని నిలదీసింది. టెండర్ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ సరఫరా కోసం ఈనెల 14న పిలిచిన టెండర్‌ను సవాలు చేస్తూ శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ యజమాని సావిత్రి, మరికొందరు హైకోర్టులో అత్యవసరంగా వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. అనుకూలమైన వారికి ప్రయోజనం చేసే నిమిత్తం టెండర్ నిబంధనల్లో సవరణ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.