Shilpa Nagini Reddy made accusations against TDP: ఆయా సమస్యలపై చర్చించేందుకు నంద్యాల పురపాలక సంఘం సమావేశం అయింది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సంక్రాంతిలోపు పట్టణంలోని నీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారని.. ఆ హామీ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ టీడీపీ నేతలు నిరసన తెలపగా.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి, కౌన్సిలర్ శిల్పా నాగిణి రెడ్డి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
నంద్యాల పురపాలక సంఘం సమావేశం రసాభాసగా సాగింది. పట్టణంలో నెలకొన్న తాగునీటి కొరతను తీర్చాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు మహబూబ్ వలి (34 వార్డు), జైనాబ్ (1 వార్డు) , నాగార్జున (27 వార్డు), శ్రీదేవి (21 వార్డు) ప్లకార్డు చేతపట్టి నిరసన తెలిపారు. సంక్రాంతి పండుగ లోపల నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇంతవరకు సమస్య పరిష్కరానికి నోచుకోలేదని తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్లు తెలిపారు. సమస్యపై స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. నిరసనల మధ్యే సమావేశాన్ని ప్రారంభించి అజెండాలోని అంశాలు ప్రారంభించారు.