CM Jagan Silent In Krishna Water Allocations :కృష్ణా జలాలపై కేంద్ర నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతంగా మారనున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఉలకడం, పలకడం లేదు. కృష్ణా పరివాహాక ప్రాంత ప్రజలతోపాటు రాయలసీమ రైతులు, సాగునీటిరంగ నిపుణులు ఆందోళన చెందుతున్నా.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్‌కు గానీ, మంత్రులు, వైసీపీ నేతలకు గానీ చీమకుట్టినట్లైనా లేదు.
Farmers and Irrigation Experts are Worried About Krishna Water :కర్ణాటక ఎన్నికల సమయంలో ఎగువభద్రను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన కేంద్రం.. ఇప్పడు తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా కృష్ణా జలాల పునఃసమీక్షకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలూ ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నా సీఎం జగన్ మాత్రం చలించడం లేదు. ఈ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించింది.
కృష్ణా జలాల కోసం మొదటి నుంచీ అంతో ఇంతో పోరాడుతున్న అధికారులు సైతం నిరుత్సాహపడిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదని.. రాజకీయంగానే పోరాడాలని తేల్చి చెప్పారు. అలా చేసి ఉంటే ఇప్పడు ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు.
CM Jagan Silent In Krishna Water Disputes :బచావత్ ట్రైబ్యునల్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అందులో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో అమల్లో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు 811 TMCలు ప్రాజెక్ట్‌ల వారీగా కేటాయించాలని అప్పగించారు. అదే విధంగా తక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించాలన్నది కూడా తేల్చాలని చెప్పారు. ఈ రెండింటినీ ఇంకా తేల్చలేదు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం అప్పటికే కేటాయింపులు ఉండి వినియోగంలో ఉన్న ప్రాజెక్ట్‌ల నీటి కేటాయింపులకు రక్షణ కల్పిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ప్రకటించింది. అది ఇంకా నోటిఫై చేయలేదు. అందువల్ల ఆ అవార్డు పాస్ కాలేదు.
అయితే తెలంగాణ మాత్రం నీటి కేటాయింపులన్నింటినీ పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. నీటి లభ్యత, కరవు ప్రాంత అవసరాలు పరిగణనలోకి తీసుకుని కొత్తగా కేటాయింపులు చేయాలని కోరింది. ఆ డిమాండ్ మేరకే బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు అదనపు నిబంధనల కింద రెండు తెలుగు రాష్ట్రాల అంశాల జల వివాదాలు పరిశీలించాలని కేంద్రం అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్ ట్రైబ్యునల్ తాను గతంలో చెప్పిన బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పిస్తున్నామన్న మాటకు ఎంత వరకు కట్టుబడి ఉంటుందనేది ప్రశ్నార్థకమవుతోంది. మొత్తం పునఃసమీక్ష నేపథ్యంలో ఎలాంటి విపరిణామాలు ఏర్పడతాయనే ఆందోళన వినిపిస్తోంది.