కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2లోక్‌సభ స్థానాలను వైకాపా తన జేబులో వేసుకుంది. తెదేపా ముఖ్య నేతలను వెనక్కు తోసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి,మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో వైకాపా నేత బిజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ బరిలో దిగిన కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని హఫీజ్ ఖాన్ కైవసం చేసుకున్నారు.
రాజకీయ కుటుంబాలకు పరాభవం..
కోట్ల, కేఈ కుటుంబాలకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బే తగిలింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయగా ఇద్దరూ ఓడిపోయారు. ఆస్థానాల్లో డాక్టర్ సంజీవ్ కుమార్, పి.జయరాం గెలుపొందారు. ఇక కేఈ కుటుంబంలోనూ ఇద్దరు పరాభవం పొందారు. పత్తికొండ అసెంబ్లీ స్థానానికి ఆయన కుమారుడు కేఈ శ్యామ్‌బాబు, డోన్ నియోజకవర్గానికి ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేయగా ఇద్దరూ ఓడిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కె. శ్రీదేవి, బుగ్గన రాజేంద్రనాథ్ గెలుపొందారు. మరో ముఖ్య నియోజకవర్గమైన నంద్యాల అసెంబ్లీ స్థానంలో శిల్పా రవి చంద్రారెడ్డి జెండా పాతారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓటమి చవిచూశారు. నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని కూడా వైకాపానే సాధించింది. తెదేపా నేత శివానందరెడ్డిపై పోచ బ్రహ్మానందరెడ్డిపై చేయి సాధించారు.