Relationship Problems: పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు. భార్యాభర్తలిద్దరూ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చారు. కౌన్సెలర్ ఇద్దరినీ కూర్చోబెట్టి విషయం ఏమిటని అడిగాడు. ‘విడాకులు తీసుకుంటాం’ అని ముక్తకంఠంతో చెప్పారు. ‘అదే ఎందుకూ...’ అడిగాడాయన. ‘ఆమె నా తల పగలగొట్టింది...’ నుదుటి మీద దెబ్బని తడుముకుంటూ కోపంగా చెప్పాడు అబ్బాయి.
ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూశాడు కౌన్సెలర్. ‘నేనేం కొట్టాలని కొట్టలేదు. తనే ముందు నన్ను కొట్టాడు’ విసురుగా చెప్పింది అమ్మాయి. డబ్బు ఖర్చుచేసే విషయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగిందట. కోపంలో అతను ఆమె చెంప పగలగొట్టాడు. ఆమె చేతిలోని ఫోన్‌ను అతడికేసి విసిరింది. అది అతడి తలకు తగిలింది. విషయం తెలిసి ఇద్దరి అమ్మానాన్నలూ వచ్చేశారు.
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డపై చేయిచేసుకున్న అల్లుడిని క్షమించేది లేదన్నారు అమ్మాయి తల్లిదండ్రులు. మొగుడి మీద చెయ్యెత్తిన అమ్మాయిని తమ కోడలిగా భరించలేమన్నారు అబ్బాయి తల్లిదండ్రులు. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
మరో జంట...పెళ్లై ఆర్నెల్లు. మంచి ఉద్యోగాలు. ఇద్దరూ మొన్నమొన్నటివరకూ బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా అమ్మాయి విడాకులకు దరఖాస్తు చేసింది. ఎందుకనీ అంటే- భార్యాభర్తల మధ్య పని విషయంలో తరచూ గొడవలు అవుతున్నాయట. ఇంటిపనుల్ని ఇద్దరూ పంచుకుని ఏ పని అయినా రోజుకొకరు చొప్పున చేయాలని ముందుగానే ఒక ఒప్పందానికి వచ్చారట.
ఇప్పుడా అబ్బాయి దాన్ని మర్చిపోయి- నేను చేయను పొమ్మన్నాట్ట... అమ్మాయి వేరే రూమ్ చూసుకుని వెళ్లిపోయింది. విడాకులకు నోటీసు పంపింది. యువ రక్తం కదా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వయసు అడ్డు కాదనిపిస్తోంది. ఆ మధ్య లోక్ అదాలత్ ముందుకు ఒక కేసు వచ్చింది. ఆయనకి 74, ఆమెకు 65. ముంబయిలో ఉండేవారు.
పిల్లల పెళ్లిళ్లు కాగానే భర్తనుంచి విడిపోయి ఒంటరిగా ఉంటూ ఫ్యామిలీ కోర్టులో విడాకులూ జీవనభృతీ కోరుతూ కేసు పెట్టింది భార్య. ఆరోపణలూ ప్రత్యారోపణలూ చేసుకుంటూ నాలుగు కేసులు పెట్టుకున్నారు. వాటి విచారణకు తిరిగి తిరిగీ విసిగిపోయి చివరికి లోక్ అదాలత్ ముందుకు వెళ్లారు ఇద్దరూ. అక్కడి న్యాయాధికారులు నచ్చజెప్పినా లాభం లేకపోవడంతో అప్పటికప్పుడు విడాకులు మంజూరు చేశారు.
ఏ నగరంలో కుటుంబన్యాయస్థానం ముందు చూసినా ఇలాంటి కేసులు వందలూ వేలల్లో కన్పిస్తున్నాయి. మన దగ్గర ప్రతి జిల్లాలోనూ కుటుంబ న్యాయస్థానాలు ఉన్నాయి. ఒక్కటి సరిపోవడం లేదని కొన్ని జిల్లాల్లో అదనపు న్యాయస్థానాలనూ పెట్టారు. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన రెండు కుటుంబ న్యాయస్థానాలనూ చూస్తే 2022లో ఈ కోర్టుల్లో విడాకులు, వివాహహక్కుల పునరుద్ధరణ, మెయింటెనెన్స్, పిల్లల కస్టడీకి సంబంధించి 2125 కేసులు నమోదయ్యాయి.
వీటిల్లో అన్నిటికన్నా ఎక్కువ ఉండేది విడాకుల కేసులేనంటున్నారు న్యాయనిపుణులు. మొత్తం కుటుంబ వివాదాలకు సంబంధించి రోజుకు 80నుంచి వంద కేసులు ఈ కోర్టు ముందుకు వస్తున్నాయట. హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయనుకుంటే పొరపాటే. సంగారెడ్డి కోర్టులో కూడా ఏటా వెయ్యినుంచి 1500 కేసులు నమోదవుతున్నాయట.
అంకెలే చెబుతున్నాయి:ప్రపంచ సగటుతో చూస్తే- వెనక మన దేశంలో విడాకులు చాలా తక్కువ. 1.1 శాతం మాత్రమే ఉండేవి. దాంతో విడాకులు తక్కువ ఉన్న దేశంగా పేరుండేది. అలాగే ప్రపంచమంతటా అధికశాతం విడాకుల కేసుల్ని మహిళలు పెడుతోంటే, మన దేశంలో పురుషులు మాత్రమే పెట్టేవారు. ఇప్పుడీ రెండు విషయాల్లోనూ మార్పు వచ్చింది. మన దేశంలోనూ గత రెండు దశాబ్దాలుగా విడాకుల కేసులు బాగా పెరుగుతున్నాయి.
దాదాపు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. అసలు 1941 తర్వాతే మన జనాభా లెక్కల్లో విడాకుల కేసుల గురించి విడిగా నమోదు చేయడం మొదలెట్టారు. 1961 నుంచి న్యాయస్థానంలో విడాకులు తీసుకున్నవారితో పాటు, పెద్దల ఎదుట పరస్పర అంగీకారంతో విడిపోయినవారినీ నమోదుచేస్తున్నారు. 2011 జనాభా లెక్కల్లో మొదటిసారి న్యాయస్థానంలో చట్టపరంగా విడాకులు తీసుకున్నవారి సంఖ్యనూ, అనధికారికంగా విడిపోయిన వారి సంఖ్యనూ విడివిడిగా నమోదుచేశారు.
అప్పుడు ఆ లెక్కల్ని విశ్లేషిస్తే 2001 నుంచి 2011 మధ్య విడిపోయిన వారి సంఖ్య 48 శాతం పెరిగిందని తేలింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం- దాదాపుగా అన్ని వర్గాల్లోనూ విడిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే విడాకులు తీసుకున్న పురుషుల్లో అధికశాతం తిరిగి వివాహం చేసుకుంటున్నారు. మహిళల్లో మాత్రం చాలా తక్కువ మంది పునర్వివాహం చేసుకుంటున్నారు. రకరకాల కారణాల వల్ల చాలామంది ఒంటరిగా మిగులుతున్నారు. దాంతో విడాకులు పొందిన పురుషులు తక్కువా, మహిళలు ఎక్కువా ఉంటున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణాల గురించి నిపుణులేమంటున్నారంటే...
కారణాలు ఎన్నో..:ఒకప్పుడు జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనకా ముందూ ఆలోచించేవారు. ఇప్పుడు అన్నిట్లోనూ వేగం వచ్చినట్లే ఇందులోనూ వచ్చింది. చటుక్కున నిర్ణయాలు
తీసుకుంటున్నారు.
- పెళ్లంటేనే రెండు భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చినవారు కలిసి కాపురం చేయడం. అటువంటప్పుడు ఇద్దరూ ఎంతోకొంత సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఎవరికి వారు- ‘నాకేం తక్కువ, నేనెందుకు సర్దుకుపోవాలి’ అనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో సర్దుబాటు ధోరణి లేకపోవడమే విడాకులకు కారణమవుతోంది.
- వైవాహిక బంధానికి పునాది నమ్మకం. అది బీటలు వారుతోంది. ఆకర్షణలు ఎక్కువవుతున్నాయి. వివాహేతర బంధాలవైపు మళ్లుతున్నారు.
- మానసిక సాన్నిహిత్యం కొరవడుతోంది. ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ గడపడం లేదు. ఉద్యోగాలకు తోడు ఎవరి వ్యాపకాలు వారికి ఉంటున్నాయి. బంధం బలపడడం లేదు కాబట్టే విడిపోవడానికి ఎక్కువగా ఆలోచించడం లేదు.
- విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. పెద్ద ఫ్లాటూ కారూ అంటూ ఆదాయానికి మించి ఖర్చు చేసి చివరికి పరిస్థితి చేయి దాటిపోయాక ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ ప్రభావమంతా భాగస్వామి మీద పడుతుంది. గొడవలు మొదలవుతాయి. చివరికి- నీవల్లే అంటే కాదు నీవల్లే అని ఆరోపించుకుంటూ సమస్యను తెగేదాకా లాగుతున్నారు.
- ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇంటికి రాగానే అతడు టీవీ దగ్గర కూర్చుంటాడు. వచ్చీ రావడంతోనే మళ్లీ వంటింట్లోకి వెళ్లి పనిచేయడానికి ఆమె చికాకుపడుతుంది. మాటామాటా పెరుగుతుంది. మనసు విరిగిపోతుంది. బంధం పట్ల అసంతృప్తి పేరుకుపోతుంది.
- చాలాసార్లు తల్లిదండ్రుల జోక్యమూ పెద్ద సమస్యగా మారుతోంది.
- ఇద్దరికీ ఉద్యోగం ముఖ్యం. కెరీర్‌లో పైకెదగాలని ఆశపడుతూ ఆ క్రమంలో అనుబంధానికి ప్రాధాన్యమివ్వడం లేదు. చిన్న చిన్న అభిప్రాయభేదాలొచ్చినప్పుడు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి ఉండటం లేదు.
- ఇప్పటి యువతరం అలవాట్లూ కొంతవరకు కుటుంబజీవనాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం, పబ్బులూ క్లబ్బులూ, సిగరెట్టూ మద్యంలాంటివీ... గొడవలకు దారితీసి చినికి చినికి గాలివానని చేస్తున్నాయి.
- సంబంధాలు చూసుకునేటప్పుడు చదువూ హోదా అందచందాలు లాంటివి చూస్తున్నారు కానీ కంపాటిబిలిటీ గురించి ఆలోచించడం లేదు. యువత కూడా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఆశయాలకు ప్రాధాన్యమివ్వాలో అభిరుచులకు ప్రాధాన్యమివ్వాలో తెలుసుకోలేకపోతున్నారు.
- లైంగిక సమస్యలూ ఈమధ్య విడాకులకు కారణమవుతున్నాయి. సమస్యని దాచి పెళ్లి చేసుకోవడంవల్ల తర్వాత అది విడాకులకు దారితీస్తోంది.
- విడాకుల ప్రక్రియ ఆలస్యమవుతుందని చాలామంది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతున్నారు కానీ అసలు బాధితులుగా పిల్లలు మిగులుతున్నారు. విడాకుల కేసు అయిపోయిన తర్వాత మళ్లీ కస్టడీ కేసులు నమోదవుతున్నాయి. వాటిని పిల్లలమీద ప్రేమతో కాకుండా అవతలి వ్యక్తిని వేధించడానికి మార్గంగా చూస్తున్నారు.
మార్పు... ఒకవైపే..:సమాజం మారుతోంది. స్త్రీపురుష సమానత్వం దిశగా ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో తమ ముందుకువస్తున్న అవకాశాలను చకచకా అందిపుచ్చుకుంటూ అమ్మాయిలు ముందుకు సాగిపోతున్నారు. వారి దృక్పథంలో చెప్పుకోదగిన మార్పు వస్తోంది. ఆ మధ్య దిల్లీలో ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం- కుటుంబం, ఉద్యోగం- రెండిటిలో ఒకటే ఎంచుకోవాల్సి వస్తే ఉద్యోగాన్నే ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది.