Srisaialam water storage: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అడుగంటుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 804 అడుగులకు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గతంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి... 1118 టీఎంసీల నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ సహా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు 1086 టీఎంసీలు తరలించారు. ఎడమగట్టు కేంద్రం నుంచి 386, కుడిగట్టు కేంద్రం నుంచి 252 టీఎంసీల చొప్పున కేవలం విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి కిందికి వదిలారు. తాగు, సాగునీటి అవసరాల కోసమే జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని వినియోగించి నీటిని సముద్రంపాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై గత నవంబరులో కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాయలసీమ ప్రజలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
అడుగంటిన శ్రీశైలం జలాశయం... ఆందోళనలో రైతులు నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం..
శ్రీశైలం నీటిమట్టం 810 అడుగుల వరకు ఉంటే హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి నీటిని తీసుకోవచ్చు. ప్రస్తుతం 804 అడుగులకు పడిపోవటంతో... హంద్రీనీవా కాల్వకు నీటి సరఫరా ఆగిపోయింది. కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రధాన కాల్వ వెంట నందికొట్కూరు నుంచి పత్తికొండ వరకు రైతులు రబీలో పంటలు వేశారు. గతేడాది ఏప్రిల్ వరకు కాల్వకు నీటిని విడుదల చేయగా... ఈ ఏడాది ఫిబ్రవరి రెండోవారంలోనే ఆపివేయటంతో... సుమారు 30 వేల ఎకరాల్లో వేరుశెనగ, మిరప, కూరగాయల సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కసాపురం నుంచి జీడిపల్లి వరకు 20 వేల ఎకరాలకు నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
కర్నూలు జిల్లాలో తాగునీటికి అవస్థలు తప్పవంటున్న నిపుణులు..
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ఏటా 10 లక్షల మంది భక్తులు హాజరవుతుంటారు. జలాశయంలో నీటి మట్టం తగ్గటంతో పాతాళగంగ చివరి మెట్లు దాటి నీరు కిందికి చేరింది. ఇంత దిగువకు దిగి భక్తులు పుణ్యస్నానాలు చేయటం అత్యంత ప్రమాదకరమని.. జల్లు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు... ఈ ఏడాది జూన్ వరకు తాగునీటి అవసరాలకు సరిపోతుంది. వర్షాభావ పరిస్థితులు ఎదురై ఆగస్టు వరకు శ్రీశైలానికి నీళ్లు రాకపోతే కర్నూలు జిల్లాలో తాగునీటికి అవస్థలు తప్పవని నిపుణులు అంటున్నారు.
ఇదీ చదవండి:Tirumala: తిరుమల కనుమదారిలో అగ్ని ప్రమాదం