ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల బియ్యం...పెద్దలకు పరమాన్నం

పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న బియ్యం పెద్దలకు పరమాన్నంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా అక్రమ తరలింపు ఆగడం లేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, డీలర్ల నుంచే నేరుగా ప్రభుత్వ సంచుల్లోనే వ్యాపారులకు చేరవేస్తున్నారంటే ఎంతకు తెగించారో ఇట్టే అర్థం చేసుకోవచ్ఛు రాయితీ బియ్యాన్ని పాలీష్‌ పట్టి పక్క రాష్ట్రాలకు తరలించి ఏటా రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండ, అధికారుల ఆశీస్సులతో యథేచ్ఛగా అక్రమణ రవాణాకు తెర తీస్తున్నారు.

ration rice business mafia in kurnool district
బనగానపల్లికి చేరవేస్తున్న బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

By

Published : Oct 17, 2020, 6:05 PM IST

జిల్లాలో కోవెలకుంట్ల, గుల్లదుర్తి, బనగానపల్లిలో రాయితీ బియ్యం వ్యాపారులున్నారు. మరోవైపు బనగానపల్లిలో ముగ్గురు వ్యాపారులు కొన్నేళ్లుగా బియ్యం మాఫియాగా కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రామాల వ్యాపారులు గతంలో ఒకరినొకరు పోలీసులకు సమాచారాలిచ్చి సరకు పట్టించారు. అప్పట్లో సద్దుమణిగిన మాఫియా మళ్లీ పెట్రేగి పోతోంది. గుల్లదుర్తి వ్యాపారి వద్ద 30 మందితో కూడిన ముఠా ఉంటుంది. వీరికి ప్రతి రోజూ రూ.300-500 కూలి ఇచ్చి, టిఫిన్‌.. భోజనం, ద్విచక్ర వాహనాలు అప్పగించి బియ్యం సేకరిస్తున్నారు. బనగానపల్లిలోని ముగ్గురు వ్యాపారులు ప్రస్తుతం ఒక్కటయ్యారు. ఇలా ఈ రెండు మండలాల వ్యాపారులు అక్రమంగా సేకరించిన బియ్యాన్ని చెన్నై, బెంగళూరు, మహారాష్ట్రకు తరలిస్తారు. ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్‌, కర్నూలులోనూ బియ్యం డాన్‌లున్నారు.

అడపాదడపా....

ఈ నెల 15న అర్ధరాత్రి మహానంది, నంద్యాలకు మండలాలకు చెందిన డీలర్ల నుంచి నేరుగా బనగానపల్లి వ్యాపారులకు చేరవేస్తున్న రూ. లక్షన్నర విలువజేసే 75 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది డీలర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోవెలకుంట్ల నుంచి 160 బస్తాల రేషన్‌ బియ్యం బనగానపల్లికి అక్టోబర్‌ 2న తరలిస్తుండగా అమడాల మెట్ట వద్ద మినీ లారీని అదుపులోకి తీసుకున్నారు. కోవెలకుంట్లలోని పౌరసరఫరాల గోదాం నుంచి నేరుగా బనగానపల్లిలోని వ్యాపారులకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

రూ.కోట్లలో వ్యాపారం

ప్రతి నెలా జిల్లాకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యంలో 8 వేల మెట్రిక్‌ టన్నులకు(80 లక్షల కిలోల) పైగా పక్కదారి పడుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పనిచేసే అధికారులు అనుకూలమైన డీలరు ద్వారా వ్యాపారులకు చేరవేస్తున్నారు. ఆపై కొందరు డీలర్లు తూకంలో మాయాజాలంతో, బియ్యం తీసుకోని లబ్ధిదారుల వేలిముద్రలు వేయించుకుని మిగుల్చుకున్న వాటిని సైతం కిలో రూ.16 చొప్పున వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మరికొందరు ఇళ్లకు తీసుకెళ్లిన బియ్యాన్ని కేజీన్నరకు రూ.20 ఇచ్చి కొనుగోలు చేసి ఒకచోటకు చేరుస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్‌ మిల్లుల్లో పాలీష్‌ పట్టి కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌ వంటి చోట్లకు తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. పాలీష్‌ పట్టకుండా మరికొంత బియ్యాన్ని తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రలో ఉన్న మద్యం తయారీ పరిశ్రమలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

తనిఖీలకు సమయమేదీ

రేషన్‌ పంపిణీలో ప్రతి రోజు తనిఖీలు చేయడానికి ప్రస్తుతం సమయం లేదు. బియ్యం కార్డులు పంపిణీ చేసేందుకు, కార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకే సమయం చాలడం లేదు. కోవెలకుంట్ల పౌరసరఫరాల గోదాము నుంచి అక్కడ ఇన్‌ఛార్జి అధికారే రాయితీ బియ్యాన్ని దారి మళ్లించిన కోణంపై పోలీసులు గుర్తించి ఏ2గా చేర్చారు. మహానంది, నంద్యాల మండలాల్లోని చౌకదుకాణాల డీలర్ల నుంచి బనగానపల్లి వెళ్తూ పోలీసులకు చిక్కిన రాయితీ బియ్యంపై నా దృష్టికి రాలేదు.

- సయ్యద్‌ యాసిన్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

జిల్లాలో రేషన్‌ కార్డులు 12.23 లక్షలు
రేషన్‌ దుకాణాలు 2,436
ప్రతి నెలా సరఫరా అవుతున్న బియ్యం 16 వేల మెట్రిక్‌ టన్నులు
పక్కదారి పడుతోంది 80 లక్షల కిలోలు(8 వేల టన్నులు)
కిలోకి సరాసరిన రూ.30కు అమ్మినా కిలోపై రూ.10
నెలకు మిగులుతున్న లాభం రూ.8 కోట్లు
ఏటా అక్రమార్జన రూ.96 కోట్లు

ఇదీ చదవండి :

రేషన్ బియ్యం పట్టివేత..9 మంది అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details