ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్సుల మాఫియా.. పెద్దాసుపత్రి వద్దే బేరం!

శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటే ఇదే మరి. ఈ సంఘటనను చూస్తే నిజమనిపిస్తుంది. కరోనాతో సొంతవాళ్లు చనిపోయి కుటుంబసభ్యులు ఏడుస్తుంటే.. శవాన్ని శ్మశానికి తీసుకెళ్లడానికి వేలల్లో నగదు వసూలుచేస్తున్నాయి ప్రైవేట్ అంబులెన్సులు. ఇంతా దర్జాగా చేస్తున్నా.. అక్కడి అధికారులకు ఏ మాత్రం పట్టినట్టే లేదు. సాక్షాత్తూ ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందే.. ప్రైవేట్ అంబులెన్సుల డ్రైవర్లతో కుమ్మక్కై 12 - 16 వేల నుంచి దారుణంగా డబ్బులు దండుకున్నారు. ప్రభుత్వ అంబులెన్సుకే ఫోను చేసినా కూడా.. ఆ కాల్ ప్రైవేట్ అంబులెన్సుల డ్రైవర్లకే వెళుతుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి అధికారుల పనితనం.

By

Published : May 16, 2021, 4:34 PM IST

kurnool
జొహరాపురం శ్మశానవాటిక వద్ద కరోనా మృతదేహాలతో క్యూకట్టిన ప్రైవేటు అంబులెన్సులు

ఓవైపు కరోనా కాటేస్తున్నా... కల్లోలం సృష్టిస్తున్నా కొందరు కాసుల వేటను వదలడం లేదు. కుటుంబ సభ్యులను కోల్పోయి కడుపు కోతతో అల్లాడుతున్న వారి కన్నీటిని సైతం పిండుకుని జేబులు నింపుకొంటున్నారు. ఒక్కో శవం కాష్టం చేరాలంటే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ దందాకు మాఫియా ఎక్కడో తెరలేపలేదు. ఏకంగా కర్నూలు సర్వజన వైద్యశాల ప్రాంగణంలో కొందరు, ఆసుపత్రి ఆరుబయట మరికొందరు కుమ్మక్కై శవాలతో బేరసారాలు చేస్తున్నారు. ‘ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇది వెలుగులోకి వచ్చింది.

అంబులెన్సు యజమానితో మాట్లాడగా...

కరోనా మృతదేహాన్ని జొహరాపురం శ్మశానవాటికకు తరలించాలి. ఎంతవుతుంది?

మృతదేహాన్ని పట్టేందుకు మీరు ఉంటారా? మనుషులను మాట్లాడాలా?

మనుషులకు ఎంత అవుతుంది?

అంబులెన్సుకు అన్నీ కలిపి రూ.16 వేలు ఇవ్వండి. ఇద్దరు మనుషులు శవాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఎక్కించడం, జొహరాపురంలో దించడం.. వాళ్ల పని.

పెద్దాస్పత్రి నుంచి తక్కువ దూరమే కదా? అంత ఎందుకు చెబుతున్నారు?

మీకు తెలియంది కాదు. డ్రైవర్‌కు రూ.2 వేలు ఇవ్వాలి. శ్మశానవాటిక వద్ద బండ్లు క్యూలో ఉంటాయి. ఒక్కో శవాన్ని కాల్చేందుకు గంటన్నరపైగా పడుతోంది. ఎంత లేదన్నా ఐదారు గంటలు వేచి ఉండాలి. మృతదేహాన్ని తీశాక బండిలో శానిటైజ్‌ చెయ్యాలి. అందుకే అంత ధర.

సరే.. వేరే అంబులెన్సు వాళ్లని అడిగి అప్పుడు చెబుతా?

నాకే ఐదు అంబులెన్సులున్నాయి. రోజూ ఎక్కువమంది చనిపోతున్నారు. నా బండ్లు ఖాళీగా లేవు. వేరే తెలిసిన అంబులెన్సు మీకు పంపాలి. మీరు ఎవరిని అడిగినా అందరూ ఇదే రేటు. ఇంతకీ మీవాళ్లు ఎక్కడ చనిపోయారు? పెద్దాసుపత్రిలో చనిపోతే మాకు తెలుస్తుందే? బాడీ ఎక్కడ ఉంది? ముందు అది చెప్పండి.

నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఇంట్లో చనిపోయారు. జొహరాపురానికి దగ్గరే కదా? చివరికి ఎంతకు వస్తారో చెప్పండి?

అంబులెన్సుకు రూ.8 వేలు, మనుషులు, వాహనం శానిటైజ్‌ చేసేందుకు రూ.4 వేలు కలిపి మొత్తం రూ.12 వేలు ఇవ్వండి. అంతకంటే ఇక తగ్గదు.

గతేడాది కరోనా సమయంలో మృతదేహాలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించేవారు. ప్రస్తుతం మహా ప్రస్థానం వాహనాలు 5 అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పినా శవాలను చేరవేసేది చాలా తక్కువ. దీనికి కారణం ప్రైవేటు అంబులెన్సుల దందాకు గేట్లు తీయడమే. ఇలా ప్రభుత్వాసుపత్రి వద్ద కొన్నింటిని తీసుకెళుతుండగా, చాలావరకు బంధువులకు అప్పగిస్తున్నారు. ఇదే అవకాశంగా దళారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి రూ.వేలల్లో దండుకుంటున్నారు.

కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవరూ దగ్గరికి రాని దుస్థితి నెలకొంది. దీంతో చేసేది లేక చివరి చూపు చూసుకుని అంబులెన్సుల్లో మృతదేహాలను తరలించేందుకు అడిగినంత ఇస్తున్నారు. సర్వజన వైద్యశాల నుంచి జొహరాపురం శ్మశాన వాటికకు కరోనాతో మృతి చెందిన వారిని తరలిస్తున్నారు. ఇక్కడికి మృతదేహాలను తీసుకొచ్చేది ప్రైవేటు అంబులెన్సులే. ఒక్కో శవం కాష్టం చేరాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే. బంధువులు మృతదేహాన్ని ఎక్కించి, దించేందుకు ఉంటే రూ.8 వేలు, అదనంగా మనుషులు కావాలంటే రూ.12-16 వేల వరకు వసూలు చేస్తున్నారు.

దందాలో సిబ్బంది హస్తం!

ప్రైవేటు అంబులెన్సులను దర్జాగా పెద్దాసుపత్రి ప్రాంగణంలో.. షెడ్డు కింద పార్కింగ్‌ చేస్తున్నారు. ఆసుపత్రిలో సాధారణ, కరోనా మరణం, అత్యవసర చికిత్స.. ఇలా రోగులకు ఏది అవసరమైనా వెంటనే బయట ప్రైవేటు అంబులెన్సులకు సమాచారం వస్తోంది. ఈ సమాచారాన్ని ప్రైవేటు అంబులెన్సులకు ఇచ్చినందుకు రూ.300 కమీషను ఇస్తున్నారు. మహాప్రస్థానానికి ఫోన్‌ చేసినా తిరిగి ప్రైవేటు మాఫియాకు సమాచారం అందుతోందని బాధితులు వాపోయారు. ఇక ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికే సొంత అంబులెన్సులు ఉన్నాయని, ఫలితంగా కరోనా మృతుల వివరాలను బయటకు చేరవేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. పెద్దాసుపత్రి అడ్డాగా ఇంత దందా జరుగుతున్నా ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి:

'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

ABOUT THE AUTHOR

...view details